Congress | గాంధీభవన్లో సోమవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యతో దీపాదాస్ మున్సీ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. తన కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన తమ కుటుంబానికి మరో పదవికి ఇవ్వకూడదా? అని అంజన్ కుమార్ యాదవ్ నిలదీశారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.
2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన అంజన్ కుమార్ యాదవ్ 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే అంతకు ముందు దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేస్తేనే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.