Revanth Reddy | కన్నుమూసినా తెరిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బనకచర్లే కనిపిస్తున్నది. పోతిరెడ్డిపాడు అనుభవం గుర్తొస్తున్నది. ఆ ఒక్క తూము తెలంగాణ ఉద్యమాన్ని రాజేసిన గతం గుర్తొస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లదోపిడీనుంచే పుట్టిన విషయం గుర్తొస్తున్నది. ఒక్క తూము నిర్మించిన పాపం పదేండ్లు ఇంట్లో కూర్చోబెడితే.. ఇవాళ ఒక నదికి నదే తరలి వెళ్లిపోతే ఎన్ని దశాబ్దాలు అజ్ఞాతవాసంలో ఉండాల్సివస్తుందోనన్న బెంగ వెంటాడుతున్నది. తమ చేతుల్లో ఏమీ లేని నిస్సహాయత కుంగదీస్తున్నది. ఎవరు నడిపిన పార్టీ? ఎవరు మోసిన పార్టీ? ఇవాళ బయటినుంచి వచ్చిన వ్యక్తి పుట్టిముంచుతున్నా.. మౌనం పాటిస్తున్న అధిష్ఠానం నిష్క్రియాపరత్వం మీద కోపం కట్టలు తెంచుకుంటున్నది.
జాతీయపార్టీలో ఒక వ్యక్తి సొంత నిర్ణయం ఏమిటి? దానివల్ల తెలంగాణకు రేపటి పర్యవసానమేమిటి? పార్టీలో ఓ చర్చ లేదు.. ఎమ్మెల్యేలకు చెప్పలేదు.. మంత్రులు ఓకే అనలేదు.. ఢిల్లీ పెద్దలు అనుమతి ఇవ్వలేదు. అది గురుదక్షిణో.. గుట్టుమట్టు ప్రయోజనమో తెలియని ఓ నిర్ణయంతో పార్టీ పుట్టి మునగాలా? రాష్ట్రం మునగాలా? అనేది గుసగుసల్లో వేడెక్కుతున్న ప్రశ్న. ఏదో చేయకపోతే, ఎవరో ముందుకు రాకపోతే రాష్ట్రంలో పార్టీ ఇక ఆత్మహత్య చేసుకున్నట్టేననేది ఏకగ్రీవ అభిప్రాయం.
అటు తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ వర్సిటీల్లో నిప్పు రాజేస్తున్నదనే సమాచారం చూసి వణుకు. రేపు న్యాయపోరాటానికి దిగితే ప్రజల ముందుకు ఏం ముఖం పెట్టుకుని పోతామనే ఆందోళన.. ముద్ద గొంతు దిగనివ్వడం లేదు. ఆ ఒక్కడు తప్ప ఎవరూ సమర్థించని ఈ నిర్ణయాన్ని ఆపే మొనగాడే పార్టీలో లేడా? అనేది వారి ఆక్రోశం. ఎవరు ముందుకు వచ్చినా వెనుక నిలబడి తీరుతామనేది సంకల్పం! అవును, పార్టీని రక్షించడానికి కాంగ్రెస్‌కు ఇప్పుడు కావలిసింది పాదయాత్రికురాలు కాదు, పీజేఆర్లాంటి ఓ దమ్మున్న లీడర్ కావాలి!
హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఏపీలో చంద్రబాబు నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్‌లో భూకంపం సృష్టిస్తున్నది. ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా, తుఫానుకు ముందు ప్రశాంతతలా ఉన్నది. బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలంతా రగిలిపోతున్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో ఆయన తీరుపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. సీఎం వైఖరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతుల్లేకుండా చేసేలా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ బనకచర్ల నిర్మాణం మొదలైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరణశాసనమే అవుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుకు సాగిలపడి, బనచర్లకు అంగీకరిస్తే కాంగ్రెస్ మునిగిపోవడం పక్కా అని, ఇది పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమేనని, చేజేతులారా విషం తాగడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా బనకచర్లపై రేవంత్‌రెడ్డి ముందుకే వెళ్తారనేది స్పష్టం అవుతున్నదని, ఏపీలో చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ప్రకటనలు, తాజాగా పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని చెప్తున్నారు. ఇదే జరిగితే ప్రాజెక్టులో పేర్చే ఒక్కో ఇటుకతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీన్ని అడ్డుకునే మొనగాడే లేడా?
తాజా పరిణామాలపై ఓ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నారు. బనకచర్ల అంశం, రేవంత్‌రెడ్డి వైఖరితో పార్టీకి జరిగే నష్టంపై కడుపుచించుకునేలా తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘బనకచర్ల అవసరం ఉంటే చంద్రబాబు వచ్చి మనల్ని దేబరించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు ఉరికి ఉరికి ముందుకెళ్లి చర్చలు, కమిటీలు అంటున్నడో మాకేం అర్థమైతలేదు. ఇందులో లోగుట్టు ఏమిటో అర్థమైతలేదు’అని తన అనుమానం, ఆవేదనను వ్యక్తంచేశారు. ‘ఇంటిదొంగ ప్రాణగండం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. రాష్ర్టాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడాల్సిన వ్యక్తి పొరుగు రాష్ట్రంతో కుమ్మక్కై సొంత ప్రాంతానికి ద్రోహం చేస్తే, ఇక్కడ మన పార్టీ ఏమైపోవాలి’ అని వాపోయారు.
బనకచర్లపై పూటకో మాటతో అబద్ధాలు వండివార్చిన రేవంత్ లేదు లేదంటూనే ఢిల్లీకి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమై సంతకాలు పెట్టడంతో పార్టీ నేతలు విస్తుపోయారు. ఈ పరిణామంతో తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ముద్దాయిగా మారిందని నేతలు మండిపడుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యం.. ఇవన్నీ ఉన్నప్పటికీ పక్కకు పోతాయని, బనకచర్లతో రాష్ర్టానికి జరిగే అన్యాయమే ప్రధాన ఎజెండాగా మారుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి మరణశాసనంలా మారిన బనకచర్లను అడ్డుకోవడం ఎలా అనేదానిపై కాంగ్రెస్ నేతలు మథనపడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడే మొనగాడే లేడా? అని చర్చించుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ‘మేమే ముందుకొస్తాం.. తెలంగాణ ప్రయోజనాల కంటే పార్టీ, పదవులు ముఖ్యం కాదు’ అని ఆవేదనతో ఆక్రోశిస్తున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు తొందరపడొద్దంటూ వారిస్తున్నట్టుగా తెలిసింది.
కేసీఆర్‌కు నీళ్ల అస్త్రం.. ఎదుర్కొనేదెట్ల?
‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ నీళ్ల కోసం. అలాంటి బీఆర్ఎస్కు నీళ్లపై ఇంత మంచి అంశాన్ని అందిస్తే, వాళ్లు ఊరుకుంటారా? వాళ్లు రోడ్లపైకి వచ్చుడు ఖాయం. దీన్ని మనం ఎలా తట్టుకోగలుగుతాం’ అనే అంతర్మథనం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్నది. ‘తెలంగాణకు నీళ్లు అనేవి జీవన్మరణ సమస్య. ఒకవేళ బీఆర్ఎస్ నీళ్లను ఒక ఆయుధంగా తీసుకొని రంగంలోకి దిగితే నిప్పు రాజేయడం ఖాయం’ అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంచి ఊపుపై ఉన్న బీఆర్ఎస్కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వప్రయోజనాల కోసం బనకచర్లకు అంగీకరించడంతో ఆగ్నికి వాయువు తోడైనట్టుగా మారిందని, ప్రతిపక్ష బీఆర్ఎస్కు నీళ్ల అస్ర్తాన్ని అందించినట్టయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లోని ప్రతి నదీపై, నీళ్ల జాడలను, ముఖ్యంగా తెలంగాణ నీటి వ్యవస్థను ఔపోసన పట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బ్రహ్మాండమైన అస్ర్తాన్ని తమ సీఎం అందించారంటూ మథనపడుతున్నారట. ఇప్పటికే గోదావరి నీళ్లలో తెలంగాణకు జరుగుతున్న ద్రోహంపై బీఆర్ఎస్ యుద్ధం మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘యూనివర్సిటీల్లో విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారు. కేసీఆర్ తన స్థాయిలో కీలక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై ఏం మాట్లాడాలి.. ప్రజలకు ఎలా వివరించాలనే అంశంపై సూచనలు చేస్తున్నారు. మిగిలిన నేతలు ఎక్కడికక్కడ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి నీళ్లలో జరుగుతున్న ద్రోహాన్ని వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోరాటంతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు’ అని గుర్తు చేసుకుంటున్నారట. బనకచర్లపై సుప్రీంకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను సంప్రదిస్తున్నది. దీంతో ఏంచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఒక్క వ్యక్తి స్వార్థం కోసం..గోదావరి పాపం?
కృష్ణా జలాల్లో తెలంగాణకు నాటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన తప్పులకు 70 ఏండ్ల తర్వాత కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నదని తాజా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బనకచర్లతో గోదావరి పాపాన్ని కూడా మోయాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఒక వ్యక్తి స్వార్థం, పదవీ కాంక్ష, గురుభక్తి, భయం వంటివాటి వల్ల తాము ఈ పాపం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదంటూ మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నుంచి ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదని, ఒక్క ప్రాజెక్టుకు కూడా మరమ్మతులు చేసింది లేదని, పైగా ఉన్న నీళ్లను పొరుగు రాష్ర్టానికి రాసిచ్చే కుట్ర చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి’ అని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాడు సీఎం రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణ, ఏపీలో ప్రజలు సాగు నీళ్లు కావాలని అడిగారని, అందుకే తాము అధికారంలోకి వచ్చాక జలయజాన్ని ప్రారంభించినట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్తుచేశారు. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్న నీళ్లను పొరుగు రాష్ర్టానికి రాసిచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ దివంగత ఎమ్మెల్యే పీ జనార్దన్‌రెడ్డి(పీజేఆర్) విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే ఉదహరించారు. ‘అప్పుడెప్పుడో పోతిరెడ్డిపాడుపై కొట్లాడితే ఆయన మరణించిన 18 ఏండ్ల తర్వాత కూడా ఆయనను తెలంగాణ సమాజం తలుచుకుంటున్నది. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయినా బీఆర్ఎస్ పూజిస్తున్నది. తెలంగాణకు నీళ్ల విషయంలో అంత పట్టుదల ఉంటది. అలాంటిది మా నాయకుడే తెలంగాణకు నీళ్లలో ద్రోహం చేస్తుంటే ఎవడికి చెప్పుకోవాలి. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క సీఎం తప్పా అంతా వ్యతిరేకమే
బాబుతో బంధంతోనే సీఎం రేవంత్‌రెడ్డి బనచర్లకు మద్దతుగా ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. బనచర్లకు మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి తప్ప పార్టీలో ఏ ఒక్క నేత, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. వాస్తవానికి కూడా సీఎం ఢిల్లీలో సంతకం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బనచర్లకు మద్దతుగా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. పైగా సీఎం చేసిన పనినే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీఎంవో నుంచి సీఎం పీఆర్వో టీం నుంచి బనకచర్లకు మద్దతుగా మాట్లాడాలని ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఒత్తిడి చేస్తున్నారు. అయినప్పటికీ వారు మాత్రం మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.
ఎన్నికల ఎజెండా బనకచర్లే
నీళ్ల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆవే నీళ్లపై మళ్లీ అన్యాయం జరిగితే సహించరనే విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి గురుదక్షిణగా చంద్రబాబుకు బనకచర్ల ద్వారా మన గోదావరి జలాలను అప్పగిస్తుండడంతో వారిలో తీవ్రమైన ఆందోళన నెలకొన్నది. ఇకపై తెలంగాణలో ఎన్నికల ఎజెండా బనచర్ల అంశమేనని వారంతా ఫిక్స్ అయ్యారు. ‘మా పాలనలో అవినీతి, అక్రమాలు, పాలన వైఫల్యం ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణలో నీళ్లు అంటే నీళ్లు కాదు నిప్పు. కాబట్టి ఇవాల్టి నుంచి తెలంగాణ ఎన్నికల ప్రధాన ఎజెండా బనకచర్లనే అవుతుంది. మా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పాపంతో మాకు నోరు విప్పేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది’ అంటూ మండిపడుతున్నారు.
ప్రజలను, పార్టీని నమ్మించి మోసం
బనకచర్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలంతా పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి బనకచర్లకు ఒప్పుకొనే సమస్యే లేదని గప్పాలు కొట్టి తీరా ఢిల్లీకి వెళ్లి సంతకాలు పెట్టి రావడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెండు రోజుల్లో ఐదు అబద్ధాలు ఆడి ప్రజలను, పార్టీని నమ్మించి మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ఇక్కడ ఒప్పుకొనేది లేదంటూ బీరాలు పలికి ఢిల్లీకి వెళ్లి సంతకం పెట్టి రావడమంటే, తీవ్రమైన ఒత్తిడి లేదంటే భారీ ప్రయోజనమో ఉంటే తప్ప ఇలాంటి విషయాల్లో ఇంత తొందరపాటు నిర్ణయాలు ఎవరూ తీసుకోరని కాంగ్రెస్ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు.
భయం, భక్తి, ప్రయోజనం
సీఎం రేవంత్‌రెడ్డి బనకచర్లకు అనుకూలంగా వ్యవహరించడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందుకు భయం, భక్తి, ప్రయోజనాలుగా కారణంగా చూపుతున్నారు. చంద్రబాబుకు భక్తితో ఆయనకు గురుదక్షిణ లేదా మోదీపై భయంతో లొంగిపోయి ఉండాలి లేదా బనకచర్లతో ఇంకేదైనా భారీ ప్రయోజనం ఉండాలి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక శక్తి రేవంత్‌రెడ్డిని బనకచర్లపై ముందుకు నడిపిస్తున్నదని ఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డిని అడ్డుకునే మొగోడే కాంగ్రెస్‌లో లేడా అంటూ వారిలో వారు చర్చించుకుంటున్నారు.
అంతా ఏకపక్షమే… చర్చేది.. ఆలోచనేది ?
నదుల అనుసందానం అనేది జాతీయస్థాయి అంశమని, దీనిపై జాతీయపార్టీ స్థాయిలో కాంగ్రెస్ ఒక వైఖరి తీసుకోవాల్సి ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై రాహుల్‌ను గానీ, సోనియా గాంధీనికి గానీ కలిసింది లేదని, వాళ్ల అభిప్రాయం తీసుకున్నది లేదని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం వైఖరి ఏమిటో తెలియకుండానే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. ‘ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నీ సొంత జాగీరా, ఇష్టారాజ్యమా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చంద్రబాబుతో సమావేశానికి వెళ్లే ముందు, కమిటీ ఏర్పాటుకు అంగీకరించడానికి ముందు ఆయన ఎవరితో సంప్రదించారని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు అంగీకరించడం వల్ల తెలంగాణకు ఎదురయ్యే పర్యావసానాలు గానీ, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే పర్యవసానాలపై ఇప్పటి వరకు పార్టీలో అసలు చర్చనే జరగలేదని చెప్తున్నారు. ఇది జాతీయ పార్టీనా..ప్రాంతీయ పార్టీనా.. ఒక వ్యక్తి ఏది అనుకుంటే అది చేయొచ్చా అని నిలదీస్తున్నారు. ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం మునగాలా..? ఒక వ్యక్తి వల్ల ఒక జాతీయ పార్టీ మొత్తం సమాధి అయిపోవాలా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.