హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కాంగ్రెస్ భయపడుతున్నదా? జాబితా విడుదల అనంతరం జరగబోయే అసంతృప్తుల అల్లర్లపై ఆందోళన చెందుతున్నదా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో జాబితాను ప్రకటిస్తామని చెప్పి, వారం గడుస్తున్నా ప్రకటించకపోవటమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ నెల 15న కాంగ్రెస్ అధిష్ఠానం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపింది. అయితే, వారం గడుస్తున్నా రెండో జాబితా విడుదల కాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాబితా విడుదలకు జంకుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితా తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. ఇక రెండో జాబితా విడుదల చేస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అందుకే వెనకంజ వేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అల్లర్లు జరిగితే ప్రజల్లో పార్టీ చులకనవుతుందేమోనన్న ఆందోళన పార్టీ పెద్దల్లో వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. రెండో లిస్టు విడుదల చేస్తే నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీని వీడే అవకాశం ఉన్నదని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే రెండో జాబితా విడుదలను ఆలస్యం చేస్తున్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో రెండో లిస్టు విడుదల చేస్తే, వారికి అసంతృప్తుల సెగ తగిలే అవకాశం ఉన్నదని ఆలోచించినట్టు తెలిసింది. వాళ్ల పర్యటన పూర్తయ్యాక తీరిగ్గా జాబితా ప్రకటిద్దామని నిర్ణయించినట్టు సమాచారం.
ఇక హామీలు అమలు చేస్తారా?
జాబితా ఆలస్యంపై కాంగ్రెస్‌ను ఉద్దేశించి తెలంగాణ సమాజం సెటైర్లు పేల్చుతున్నది. ఇచ్చిన మాట ప్రకారమే రెండో జాబితా విడుదల చేయని కాంగ్రెస్.. హామీలను ఎలా నెరవేరుస్తుందని ప్రశ్నిస్తున్నది. అభ్యర్థుల అసంతృప్తినే నిలువరించలేని హస్తం పార్టీ పెద్దలు.. తెలంగాణ ప్రజల్ని పాలించేందుకు ఎలా అర్హులు అవుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ జాబితాను విడుదల చేసేందుకే జంకుతుంటే, కేసీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం సిట్టింగులకు సీట్లు కేటాయించి బీఫాంలు కూడా అందజేశారు.
తొలి జాబితాకే గాంధీభవన్‌కు తాళం
తొలి జాబితా ప్రకటించాక అసంతృప్త నేతలు గాంధీభవన్‌కు తాళంవేసి నిరసన తెలిపారు. 55 మందితో ప్రకటించిన చిన్న జాబితాకే కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి రాజుకున్నది. ఎలాంటి ఇబ్బంది లేని సీనియర్ల స్థానాలు, హైదరాబాద్ వంటి స్థానాలతో పేర్లను ప్రకటిస్తేనే ఇంత రచ్చ జరిగితే ఇక మిగిలిన స్థానాల్లో జాబితా ప్రకటిస్తే పరిస్థితి ఏమిటన్న భయం కాంగ్రెస్ పెద్దలకు పట్టుకున్నట్టు తెలిసింది. ఇంకా 64 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. ఈ జాబితాను విడుదల చేస్తే పార్టీలో అగ్గి రాజుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.