Samagra Kutumba Survey | రంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఒకటీ అరా కాదు.. ఏకంగా 56 ప్రధాన ప్రశ్నలతో కూడిన 75ప్రశ్నలు ఎన్యూమరేటర్లు సంధించనున్నారు. కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక తదితర వివరాలన్నింటినీ సేకరించనుండటంతో మున్ముందు అవి ఏ పరిణామాలకు దారి తీస్తాయోనన్న భయం వెంటాడుతున్నదని ప్రజలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఈ సర్వేపైనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు వీటినే ప్రామాణికంగా తీసుకొని వేటికి కోత విధిస్తారోనని జంకుతున్నారు. ప్రస్తుతానికి ఇంటింటికీ స్టిక్కర్ల పంపిణీ చివరి దశలో ఉన్న దరిమిలా రేపటి నుంచి సర్వే ఎలా జరగనున్నదనేది ఆసక్తికరంగా మారింది.రంగారెడ్డి జిల్లాలో 6.57 లక్షల కుటుంబాలను సర్వే చేయటానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిం ది. ఈ సర్వే కోసం 5,344 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. ఒక్కొక్క ఎన్యూమరేటర్‌కు 175 ఇండ్ల చొప్పున కేటాయించారు. ఆయా వార్డులకు కేటాయించిన ఎన్యూమరేటర్లు కుటుంబాల నుంచి సమగ్ర సర్వే చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన సర్వేఫాంలో ఉన్న అన్ని ప్రశ్నలకు కుటుంబ యాజమాని నుంచి సమాచారం సేకరించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సర్వే ప్రారంభించనున్నారు. సర్వేలో ఆధార్‌కార్డు అతి ము ఖ్యం కానున్నది. ఆధార్‌కార్డు ఆధారంగా భూ ములు, బ్యాంకు లావాదేవీలు, భూముల పా స్బుక్కులు, అన్నీ అనుసంధానమై ఉన్నాయి. దీంతో సర్వేతో తమకు లాభమా? నష్టమా? అనే విషయంలో ప్రజలు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో సర్వేపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే లక్షలాది మంది వివిధ రకాల ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారులుగా ఉన్నారు. లక్షల మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే ద్వారా ప్రభుత్వం ఆర్థిక వివరాలూ సేకరిస్తున్నది. ఆయా కుటుంబాలకు ఉన్న వ్యవసాయ భూములు, బ్యాంకు అకౌంట్ల నెంబర్లు.. కీలకమైన వివరాలను తీసుకుంటున్నారు. దీంతో మున్ముందు అర్హతా ప్రమాణాల్లో మార్పులు చేస్తే ఈ వివరాల ద్వారా ఇప్పటికే పథకాలు వర్తిస్తున్న వారు తమకు ఏమైనా కోత పడనున్నదా? ఇక ముందు వచ్చే వాటికి వీటిని ప్రా మాణికంగా తీసుకుంటారా? ఉన్న రేషన్‌కార్డు ఊడుతుందా? లేనివారికి కొత్తది వస్తదా? రా దా? ఇలా ఒకటేమిటి! అన్ని కోణాల్లోనూ ప్ర జలు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు, పత్తి ఏర టం వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నా యి. దీంతో ప్రజలు, రైతులు ఉదయాన్నే పొలాల్లోకి వెళతారు. సర్వే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలుకానుంది. దీంతో ఆ సమయంలో జనం వ్యవసాయ పనులు, ఇతరత్రా కూలీ, ఉపాధి పనులకు వెళతారు. పిల్లలు ఉంటే వాళ్లు పాఠశాలలు, కాలేజీలకు పోతారు. మరి ఇండ్లల్లో ఎవరూలేని సమయంలో ఎన్యూమరేటర్లు వస్తే డోర్ లాక్ ఉంటుంది. ఈ క్రమంలో తిరిగి ఎన్యూమరేట్లు వస్తారా? అని అనేక మంది ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రజలు వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో సర్వే చేయనుండటంతో ఇది తమకూ ఇబ్బందికరమైన పరిస్థితేనని ఎన్యూమరేటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటి వివరాలను సేకరించి స్టికరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, 9వ తేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. సర్వే నిర్వహణపై గురువారం ప్రత్యేకాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అధికారులను ఆదేశించా రు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి సర్వే జరుగుతున్న విధానా న్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.