హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనకు తెలంగాణ కాలేజియేట్ కమిషనరేట్ సోమవారం మూడు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నది. కమిషనర్ శ్రీదేవసేన మార్గదర్శకంలో ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్, బారాదరి కలెక్టివ్ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్, లాంచ్ లీడ్ ఫౌండేషన్‌తో ఆశాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నది.
సోమవారం నాంపల్లిలోని కమిషనరేట్ కార్యాలయంలో ఆర్జేడీలు డాక్టర్ యాదగిరి, డాక్టర్ రాజేంద్రసింగ్ ఆయా సంస్థల ప్రతినిధులు సంజయ్మిట్టల్, హరిహర మీనన్, రవళి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.ఈ ఒప్పందం ద్వారా మూడు సంస్థలు పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను అంచనావేయడంతోపాటు, శిక్షణ మాడ్యుళ్లను అందించడం, ఉపాధి అవకాశాల కల్పనను చేపడతాయి.
సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం!
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, లేకుంటే 15 రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి సమ్మె నోటీసును అందజేశారు.
గతం లో తాము సమ్మెకు దిగినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నెల రోజుల్లో సచివాలయానికి పిలిచి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 11 నెలలు గడిచినా తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రధాన కార్యదర్శి ఝాన్సీసౌజన్య, అనిల్‌చారి, సత్యనారాయణ, అమృత తదితరులు సమ్మె నోటీసు ఇచ్చినవారిలో ఉన్నారు.