జయశంకర్ భూపాలపల్లి, మే15 (నమస్తే తెలంగాణ): పుష్కరాల్లో స్నానం చేస్తే మనం చేసిన తప్పులకు విముక్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో గురువారం మొదలైన సరస్వతీ పుష్కరాల్లో ఆయన పాల్గొన్నారు. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. సరస్వతీ ఘాట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సరస్వతీ ఘాట్ వద్ద భక్తులనుద్దేశించి మాట్లాడారు.
‘ప్రతి ఒక్కరూ తెలియకుండా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు.. మనం చేసిన తప్పులకు ముక్తి లభించాలంటే పుష్కర స్నానాలు ఆచరించాలి.. ఇది మన శాస్త్రం చెబుతున్నది’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తన హయాంలో సరస్వతీ పుష్కరాలు రావడం, ఇక్కడ పుణ్యస్నానం చేయడం తన అదృష్టమన్నారు. మం థని నియోజకవర్గ అభివృద్ధికి శ్రీధర్‌బాబు ఎంతో తపిస్తుంటారని, శ్రీధర్‌బాబు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారన్నారు. ఆయన నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయించి, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు.
మంథని నుంచి శాసన సభ్యుడిగా పని చేసిన తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు దేశాన్ని ఆర్థిక పథం వైపు నడిపించారని, అనంతరం శ్రీపాదరావు ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంతోపాటు శాసన సభను హూందాగా నడిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మూడోతరం శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని చెప్పా రు. కాళేశ్వరం అభివృద్ధికి రూ.100 కోట్లు కావాలని అడిగారని, రూ. 100 కోట్లు కాదు.. రూ. 200 కోట్లు ఇస్తానని ప్రకటించారు.
కాళేశ్వరం ఆలయాన్ని పర్యాటకంగా మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని సీఎంను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాల పనుల కోసం 17 శాఖల అధికారులు శ్రమించారని, సీఎం సూచన మేరకు కాశీ నుంచి పండితులను పిలిపించామని చెప్పారు. మాధవానంద సరస్వతి సూచన మేరకు ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
గురువారం రాత్రి సరస్వతీ పుష్కర ఘాట్ సమీపంలో కాశీ నుంచి వచ్చిన ఏడుగురు వేద పండితులు అశితోష్ పాండే, అభిషేక్ పాండే, నితీశ్‌కుమార్ పాండే, సమంత్ తిహారీ, కౌశల్ తివారీ, దీపక్ పాండే, అంకిత్ పాండే, శివం మిశ్రా 45 నిమిషాల పాటు సరస్వతీ నవరత్న హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా పే ల్చిన పటాకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారతి కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అదే వేదికపై సీఎం మాట్లాడారు.
పుషర ఘాట్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలిం ది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చెన్నూరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశా రు. ఫ్లెక్సీల్లో పెద్దపెల్లి ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారులకు దళిత ఎంపీ కనిపించడం లేదా అని ప్లకార్డులతో ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని, ఈడ్చుకుంటూ ఠాణాకు తీసుకెళ్లారు.