హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన దరఖాస్తులు అమ్మితే ఊరుకోబోమని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్రెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టంచేశారు.
గతంలో లబ్ధి పొందనివారు, కొత్తగా లబ్ధిపొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజాస్పందన తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు.