CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష కార్యాచరణలో నిమగ్నం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. ఒక్క ఖమ్మంలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతున్నది.
మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వరద సహాయక చర్యల్లో ఎటువంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల, పంచాయతీరాజ్, హైడ్రా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
భారీ వరదలు సంభవించినపుడు సీఎం సచివాలయం నుంచి పర్యవేక్షణ చేస్తే పరిస్థితులు మెరుగుపడవనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. పొద్దున లేస్తే ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు వరదల్లో ఉంటే ప్రజల వద్దకు రాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రజలు తమకు తాముగా ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడితేనో, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తేనో ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటున్నది కానీ నేరుగా తనకు తానే కార్యక్షేత్రంలోకి దిగేందుకు అంత చొరవ ఎందుకు అంత ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం నేరుగా కార్యక్షేత్రంలోకి దిగితే ప్రజాపాలనలో ప్రజలకు మరింత ధైర్యం ఉండేదని చెప్తున్నారు.