హైదరాబాద్, డిసెంబర్13(నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఎటువంటి చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై చర్చ జరుగుతుందనే ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు సీరియస్‌గా పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ మీద చర్చ పెట్టలేమని అన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తొలుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పార్లమెంటులోని ఆమె చాంబర్లో భేటీ అయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంట్‌ను వెంటనే విడుదలచేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకూ నిర్వహణకు అయిన ఖర్చులు రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉన్నదని వివరించారు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా రూ.2,547.07 కోట్లను కేంద్రం రికవరీ చేసిందని నిర్మల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఏపీ నుంచి రూ.495.20 కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉన్నదని ఆమెకు వివరించారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిశారు. వరంగల్ జిల్లా కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. డోర్నకల్-మిర్యాలగూడ, డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని కోరారు. ఇక్కడ భూసేకరణ భారమవుతుండటంతో ప్రతిపాదిత మార్గాలను డోర్నకల్ నుంచి వెన్నారం-మన్నెగూడెం-అబ్బాయిపాలెం-మరిపెడ మీదుగా మోతె వరకు మార్చాలని కోరారు. వికారాబాద్-కృష్ణాస్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని కోరారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, రఘువీర్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ ఉన్నారు.