CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): నువ్వు కొట్టినట్టు చేస్తే.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ తీరు. ఇరు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పటికే పలుమార్లు బయటపడగా సోమవారం ఆదిలాబాద్ వేదికగా ఖుల్లంఖుల్లాగా తేలిపోయింది. నిన్నటి వరకు ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌లో ‘పెద్దన్న’ అంటూ మోదీపై ప్రత్యేక ప్రేమాభిమానాలు కనబరిచారు. దీనినిబట్టి ఇరు పార్టీల మధ్య ఉన్న చాటుమాటు ఒప్పందం మరోమారు బహిర్గతమైంది.
ఇప్పుడే కాదు, గతంలోనూ ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటనలు చాలానే జరిగాయి. కేసీఆర్ హయాంలో కంటోన్మెంట్ భూములు, స్కైవేలు, ట్రిపుల్ ఆర్, ఐఐహెచ్‌టీ వంటివాటి విషయంలో ముప్పుతిప్పలు పెట్టిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం సీఎం రేవంత్ ఇలా వెళ్లి రాగానే ఎడాపెడా అనుమతులు వస్తున్నాయి. దీనినిబట్టి రెండుపార్టీల మధ్య ఉన్న బంధం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
నరం లేని నాలుక
నరంలేని నాలుక ఎటైనా మాట్లాడుతుందని చెప్తా రు. సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో ఇది నిజమనే చె ప్పుకోవాలి. మోదీపై రేవంత్‌రెడ్డి కొంతకాలంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మోదీ పాలన లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని దు మ్మెత్తిపోశారు. ప్రజలపై ఆయన రూ.100 లక్షల కోట్ల రుణభారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ జరిగి అట్టుడికినా ఒక్కసారి కూడా ప్రధాని వెళ్లలేదని, ఇప్పుడు మళ్లీ విద్వేషాలు రెచ్చగొట్టి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశా రు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. ఇలా అనేక మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. అంతేకాదు, పునర్విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన బయ్యా రం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులను మోదీ పట్టించుకోలేదని ని ప్పులు చెరిగారు.
సోమవారం మాత్రం అదే నాలుక తో మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో గుజరాత్ మోడల్‌పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్.. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేసి అక్కడితో దానిని వదిలేశారు. విభజన చట్టం గురించి కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ గు రించి కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐర్, ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పునరుద్ధరణపై ప్రస్తావించే ధైర్యం చేయలేకపోయారు. ఐదు రోజుల క్రిత మే గుజరాత్ మాడల్‌ను తూర్పారబట్టిన సీఎం అంతలోనే జైకొట్టడం విమర్శలకు తావిచ్చింది.
‘సయోధ్య’ అప్పుడెందుకు లేదు?
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కోరుకుంటున్నామని ప్రధాని, సీఎం చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ర్టానికి ఐఐహెచ్‌టీ, రీజినల్ రింగ్‌రోడ్ దక్షిణ భాగం, స్కైవేలకు కంటోన్మెంట్ భూములు వంటివి మంజూరయ్యాయని చెప్తున్నారు. వాస్తవానికి ఇవే విన్నపాలను కేసీఆర్ ప్రభుత్వం ఏండ్ల తరబడి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ర్టానికి ఐఐహెచ్‌టీ మంజూరు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ 2020 డిసెంబర్లో కేంద్రానికి లేఖ రాశారు. అప్పటి నుంచీ ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు.
కరీంనగర్, మేడ్చల్ మార్గాల్లో స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి 2015లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కంటోన్మెంట్ భూములు కావాలని ప్రతిపాదించింది. 100 ఎకరాల కంటోన్మెంట్ భూములు అప్పగిస్తే అంతకు నాలుగైదురెట్ల ప్రభుత్వ భూములు వేరే చోట ఇవ్వడానికి అంగీకరించింది. పదుల సంఖ్యలో లేఖలు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు.
ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మళ్లీ అవే ప్రతిపాదనలు సమర్పించగానే రక్షణశాఖ భూములు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రీజినల్ రింగ్‌రోడ్ దక్షిణ భాగానిదీ ఇదే పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం డీపీఆర్ పూర్తిచేసి, దానిని జాతీయ రహదారిగా ప్రకటించాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా చలనం లేకుండా ఉండిపోయింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇలా ప్రతిపాదించగానే అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యనున్న స్నేహ బంధాన్ని బలపరుస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. తాము వందల విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని కేంద్రం.. రేవంత్ వెళ్లి రాగానే అన్నీ మంజూరవుతున్నాయని గుర్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎడాపెడా మంజూరుచేస్తున్నారని దుయ్యబడుతున్నారు.‘చంద్రబాబు దత్త పుత్రుడికి మోదీ పెద్దన్న కాకపోతే ఇంకేమైతడు?’ సామాజిక మాధ్యమాల్లో సైతం కామెంట్లు కనిపిస్తున్నాయి.
మాకది.. మీకిది
గత లోక్‌సభ ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట కాంగ్రెస్ సీనియర్లు బరిలో ఉన్నా మూడోస్థానానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీ మూడోస్థానంతో సరిపెట్టుకున్నది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ముందస్తు ఒప్పందానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచారు.
సీనియర్ నేత అయిన ఆయనకు పడాల్సిన ఓట్లు బండి సంజయ్‌కు పడడంతో ఆయన విజయం సాధించారు. మల్కాజిగిరిపై ఏమాత్రం పట్టులేని రేవంత్‌రెడ్డి పోటీచేస్తే బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆయన గెలుపొందారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఇదే జరిగిందన్నది విశ్లేషకుల మాట. ఈసారి కూడా ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న ఒప్పందం ఇరు పార్టీల మధ్య జరిగిందని, పైకి విమర్శలు అందులో భాగమేనని చెప్తున్నారు. అంతేకాదు, గతంలో మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తాను ఆరెస్సెస్ అనుబంధ పత్రిక జాగృతిలో పనిచేసినట్టు తన ఐడెంటిటీని అక్కడి రిజిస్టర్‌లా రాసుకోవడం ద్వారా తాను ఆరెస్సెస్ వాదినని, బీజేపీకి దగ్గరి వ్యక్తినని చెప్పకనే చెప్పారు.
అరగంటలోనే టార్గెట్‌గా మారిన బీఆర్ఎస్
ఆదిలాబాద్‌లో అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతులు కలిపిన తీరు, మాట్లాడుకున్న విధానం చూస్తే ఎవరికైనా ఇద్దరి మధ్య కొన్ని దశాబ్దాల స్నేహం, విపరీతమైన సాన్నిహిత్యం ఉన్నట్టు అనిపిస్తుంది. సీఎం ప్రసంగం సైతం అదేస్థాయిలో వినయపూర్వకంగా సాగింది. కానీ, ఆ తర్వాత అరగంటలోనే మోదీ మాట మార్చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ గెలిచినా ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదంటూనే బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నారు. అవినీతి, కుటుంబ పాలన వంటి రొడ్డకొట్టుడు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతామన్న కాంగ్రెస్ వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేని వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల దృష్టిని మార్చే ప్రయత్నం చేశారు.
నిన్న బేకార్.. నేడు సూపర్
గుజరాత్ మాడల్ అంటే ఊర్లో ఉన్నోళ్లను తగలబెట్టుడా? బెదిరించి ఇతర రాష్ర్టాల పెట్టుబడులను మీ రాష్ర్టానికి గుంజుకుపోవుడా?
– ఫిబ్రవరి 27న సీఎం రేవంత్
గుజరాత్ మాదిరిగా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ప్రధాని మోదీ సహకారం అవసరం.
– సోమవారం ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్