హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా దాదాపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఇండోర్‌కు వెళ్లింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మౌ గ్రామంలో ‘సంవిధాన్ బచావో’ ర్యాలీ నిర్వహించనున్నారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు తరలివెళ్లారు.
మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. వాస్తవానికి వారు కూడా వెళ్లాల్సి ఉన్నా.. మంత్రి శ్రీధర్‌బాబు స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకొని సోమవారమే హైదరాబాద్ వచ్చారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనారోగ్యం కారణంగా ఆగిపోయినట్టు తెలిసింది.
మరోవైపు వారం కిందట కర్ణాటకలో జరిగిన సంవిధాన్ బచావో కార్యక్రమానికి మంత్రులందరూ వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు విదేశాల్లో ఉండగా, మిగతా మంత్రులంతా కర్ణాటక బాట పట్టారు. పాలనను గాలికి వదిలేసి ఇలా మంత్రివర్గం మొత్తం దేశ, విదేశీ టూర్లు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తంచేశారు. పైగా ఆ సమయంలో గ్రామాల్లో నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక, గ్రామసభలతో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయినా మంత్రులంతా రాష్ట్రం వదిల వెళ్లడంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఒక్కరినైనా రాష్ట్రంలో ఉంచి వెళ్లాలని ప్రభుత్వం భావించినట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.