హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ)/నిజాంసాగర్/ఎదులాపురం : మొన్న ఆంధ్రప్రదేశ్.. నిన్న ఒడిశా.. రేపు మహారాష్ట్ర.. బీఆర్ఎస్ దేశవ్యాప్త విస్తరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కార్మిక, కర్షక, న్యాయవాద, వైద్య, సామాజిక, ఆర్థికవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన నిపుణులు సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు, బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెల 5న మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలో విస్తృతంగా పర్యటించారు. అప్పాపూర్, షివిని, ఇస్లాపూర్, హిమాయత్‌నగర్, బోకర్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్ పర్యటన గురించి స్థానికులకు తెలుపగా.. ‘కేసీఆర్ వస్తున్నారా? మా గ్రామానికి వస్తారా?’ అంటూ ఆసక్తిని కనబరిచారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మహారాష్ట్రలో చర్చ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తుందన్నదే విషయం తెలంగాణ దాటి బయటికి వస్తే తెలుస్తున్నదని అన్నారు. అతి స్వల్పకాలంలోనే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రబలమైన శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, హన్మంత్‌షిండే, మాజీ ఎంపీ నగేశ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు శనివారం నాందేడ్‌లోని సమావేశ స్థలాన్ని పరిశీలించారు.
గురుద్వారాను దర్శించుకోనున్న కేసీఆర్
కేసీఆర్ తన పర్యనటలో భాగంగా ముందుగా గు రుద్వారా దర్శనం, అక్కడ ప్రత్యేక పూజల అనంత రం, హింగోలీరోడ్ ఎదురుగా ఉన్న గురుద్వారా స త్కండ్ బోర్డ్ మైదాన్‌లో బీఆర్ఎస్ చేరికల సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం నాందేడ్ సిటీ ప్రైడ్ హోటల్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం తదితర కార్యక్రమాలున్నాయి. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల తాజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరనున్నారు.