KCR : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. 1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ గుర్తచేశారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు తాండవించేవని అన్నారు. ఆ రోజుల్లో తాను కూడా అధికార పదవుల్లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు.
ఆయన ఏమన్నారంటే.. ‘జీవితంలో ఎవరికైనా కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటయ్. కొన్ని బాధపెట్టేవిగా ఉంటయ్. 1999లో, అంతకుముందు కాలంలో తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చే పరిస్థితి. యావత్ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలిచావులకు నెలవుగా ఉండేది. నేను గూడా ఆ రోజుల్లో అధికార పదవుల్లో ఉన్నా. చాలా సుదీర్ఘ కాలం మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన. ఆరోజుల్లో సాటి మిత్రులతో కలిసి మా దుఃఖాన్ని పంచుకునే వాళ్లం’ అని గుర్తుచేశారు.
‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన 25-30 మంది శాసనసభ్యులతో కనీసం 30 సార్లు సమావేశాలు పెట్టినం. ఏం చేద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇంతేనా..? మనకు నిష్కృతి లేదా అని చర్చించినం. ఆ రోజుల్లో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకోవడం, వాళ్ల ప్రయోజనం నెరవేరిన తర్వాత పక్కకు పోవడం చేసిండ్రు. దాంతో ఇతర ప్రాంతాల వాళ్లేగాక తెలంగాణ వాళ్లే తెలంగాణను అవమానించే పరిస్థితి వచ్చింది. పది మంది కూసున్న దగ్గర కూడా తెలంగాణ అనే పదం వాడితే ఎగతాళి చేసిన పరిస్థితి’ అని కేసీఆర్ తెలిపారు.