హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): నకిలీ డాక్యుమెంట్లతో రూ.2.86 కోట్ల రుణం తీసుకొని ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో సీఐడీ అధికారులు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బొబ్బిలి వెంగళరావు, బొబ్బిలి జగన్నాథం, యలికే హరిబాబు, ముదగండ్ల రాజశేఖర్, పిన్నెబోయన కొండబాబు ఉన్నారు.
ఐడీబీఐ బ్యాంక్ సత్తుపల్లి శాఖ మాజీ బ్రాంచ్ హెడ్ నల్లగోపుల రమేశ్, బిజినెస్ కరస్పాండెంట్ చెట్టిపోగు సురేశ్ వారి సహచరులు తాటి చంద్రారావు, మేరుగు శివకృష్ణ కలిసి కిసాన్ క్రెడిట్ కార్డ్ సీమ్ కింద 2015 మార్చి నుంచి 2016 సెప్టెంబర్‌లో 279మంది రైతులకు రూ.2.61 కోట్లు, మైక్రో లోన్ సీమ్ కింద మరో 26 మందికి రూ.25 లక్షల రుణాలను మంజూరు చేశారు.
ఈ రుణాలను నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో మంజూరు చేసినట్టు ఆడిట్లో తేలింది. దీనిపై ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పీహెచ్ హషిమ్ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. గతంలోనే ఎన్ రమేశ్, బిజినెస్ కరస్పాండెంట్ చెట్టిపోగు సురేశ్‌ను అరెస్టు చేశారు.