హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి బృందం బెల్జియం పర్యటనకు వెళ్లింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అధ్యయనం కోసం నలుగురు సభ్యుల బృందం మూడు రోజులపాటు అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం బయల్దేరింది. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ ఇంటీరియర్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళ్లారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపరిచే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృతస్థాయి చర్చలు జరుగనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ బృందంలో సీఈవో సుదర్శన్‌రెడ్డితోపాటు ఖమ్మం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈవో కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఈఆర్వో కంకణాల అనంతరెడ్డి, నాంపల్లి నియోజకవర్గంలోని పోలింగ్‌స్టేషన్-97 బూత్‌స్థాయి అధికారి వేముల ధ్రువకుమార్‌రెడ్డి ఉన్నారు. పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్‌పీఎస్-ఇంటీరియర్, ఎఫ్‌పీఎస్-ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్‌లోని భారతీయ రాయభార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు జరుపనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అవుట్ రీచ్‌లో భాగమని అధికారులు తెలిపారు.