మూడేండ్లయినా భర్తీ కాని మూడు బెర్తులు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడేండ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. గత ఏడాది దసరా నుంచి అదిగోఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ చెప్తూనే ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి, హైదరాబాద్‌కు తిరిగితిరిగి విసిగిపోయారు.
- మంత్రి పదవుల కోసం ఆశావహుల పడిగాపులు
- ఇప్పుడప్పుడే ఉండదంటున్న కాంగ్రెస్ వర్గాలు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడేండ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. గత ఏడాది దసరా నుంచి అదిగోఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ చెప్తూనే ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి, హైదరాబాద్‌కు తిరిగితిరిగి విసిగిపోయారు. తొలుత కేరళ, బెంగాల్ ఎన్నికల తర్వాత విస్తరణ అన్నారు.. ఆపై సంక్రాంతికి అన్నారు.. తర్వాత ఉగాదికి ఉంటుందని చెప్పారు. నిన్న మొన్నటివరకు దసరాకు పక్కా అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయించుకున్నారు. దసరా పండుగ కూడా వచ్చేసింది కానీ, ఎక్కడా మంత్రివర్గ విస్తరణ ఊసే వినిపించడంలేదు.
అంతేకాదు.. కనుచూపుమేరలో విస్తరణ చేస్తారన్న నమ్మకం కూడా ఎమ్మెల్యేల్లో లేకుండాపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు కేసీఆర్ పూర్తిస్థాయి మంత్రివర్గంతో పాలన సాగించారని, కాంగ్రెస్ హయాంలో మూడు బెర్తులు ఎప్పుడూ ఖాళీగా ఉంటున్నాయని వాపోతున్నారు. కీలకమైన శాఖలన్నీ సీఎం దగ్గరే పెట్టుకోవడంతో పాలన కుంటుపడిందని పార్టీ వర్గాలు, అధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి మూడేండ్లయినా కనీసం మంత్రివర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో నింపలేకపోతున్న అసమర్థ పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోతుందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మిగిలిన రెండేండ్లలో చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడి ఉంటుందని, అందువల్ల ఏడాది కాలానికి మంత్రిగా ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్న భావన సీనియర్ ఎమ్మెల్యేల్లో నెలకొన్నది.
ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు
ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం దక్కింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమప్రాధాన్యం ఇచ్చారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి నిజామాబాద జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలుంటే మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వంటి వారు ఈ జిల్లాకు చెందినవారే. ఇదే పరిస్థితి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ కూడా ఉన్న ఈ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వంటివారు ఇక్కడ ఉన్నారు. వికారాబాద ఎమ్మెల్యే జీ ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నప్పటికీ ప్రజలకు అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారన్న భావన ప్రజల్లో నెలకొన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం లేకపోవడంపై అక్కడి నేతలు బహిరంగంగానే పార్టీ వైఖరిని తప్పుపడుతున్నారు.
సురేఖ స్థానమైనా భర్తీ చేయరా..?
మంత్రివర్గంలో బీసీ మహిళకు స్థానంలేదని, కొండ సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కనీసం ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్ ఉన్నది. అయితే, ఈ స్థానాన్ని ఆశిస్తున్న ఓ మహిళా నేత.. మూడేండ్లు గడిచాయి.. ఇప్పుడు మంత్రి పదవి తీసుకొని ఏం చేసుకోవాలంటూ పార్టీ అధిష్ఠానం వద్ద గట్టిగానే చెప్పినట్టు సమాచారం. రెండు స్థానాలను అలాగే ఉంచి కనీసం సురేఖ స్థానాన్నైనా భర్తీ చేసేలా చూడాలని ఆశావాహులు అధిష్ఠానానికి విజ్ఙప్తులు చేసి అలసిపోయారు.
అసంతృప్తి జ్వాలలు..
రాష్ట్రంలో సీరియస్‌గా మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలు అరడజనుకుపైనే ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందరనాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తదితరులు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దసరాకు కూడా మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో వారి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెల్సింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే తేనెతుట్టెను కదిపినట్టేనని, అది తనకు పాలనాపరంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని ఒప్పించినట్టు చెప్తున్నారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుపై గట్టిగా మాట్లాడటం వెనుక మంత్రివర్గ విస్తరణ అంశం ఉన్నదని చెప్తున్నారు. వారు తమ అనుచరులు, మిత్రులతో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నట్టు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

