కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తం. ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలివ్వలేదు. రైతులు కేవలం వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మా సిటీ రద్దయినట్టుగా చెప్తున్నరు. ఫార్మా సిటీని రద్దు చేసేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది.. భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే. మేడిపల్లిలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నం.
– నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ సారాంశమిది.
చరిత్రలో హైదరాబాద్ మహానగరం మూడు నగరాలుగా ఏర్పడితే.. బేగరి కంచె కేంద్రంగా మేం నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నం. అదే ఫోర్త్ సిటీ! దాన్ని ఫ్యూచర్ సిటీ అని కూడా అంటరు. ఏఐ సిటీ.. స్పోర్ట్స్ సిటీ.. ఐఐహెచ్‌టీ.. జూపార్కు.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు.. రేస్ క్లబ్ ఏర్పాటు చేయనున్నం. జపాన్‌కు చెందిన మారుబేని కంపెనీ, సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డాటా సెంటర్స్ ఇండియా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినయి. వాటికి ఫ్యూచర్ సిటీలో భూములు కేటాయిస్తం.
-బేగరి కంచ వేదికగా సీఎం రేవంత్‌తో పాటు పలు సందర్భాల్లో ఇతర మంత్రులు కూడా చేసిన ప్రకటనలివి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని పలు మండలాల పరిధిలో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ చేపడుతుంది. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ భూములను నిర్దేశించిన ఉద్దేశం (ఫార్మా సిటీ ఏర్పాటు) మేరకు మాత్రమే వినియోగిస్తారు గానీ, ఇతర అవసరాలకు వినియోగించరు. ఈ షరతు ఉల్లంఘన జరిగినట్లయితే ఈ భూములు తిరిగి రైతులకే చెందుతాయి.
– కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం స్పష్టమైన షరతుతో జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఇది.
జనావాసాల మధ్య ఫార్మా సిటీ ఏర్పాటు చేయడం అన్యాయం. జనాలు లేని, ఇండ్లు లేని చోట ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి రైతులకే ఇస్తాం. ‘ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు చేస్తాం’.
– కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల అభయహస్తం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ (8ఎ) ఇది.
Congress Govt | గుండాల కృష్ణ, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘చెరువుల్లో చేప పిల్లల్లా నా ఈ నగరం జనంతో నిండిపోవాలి…’ హైదరాబాద్ నగరానికి పునాదిరాయి వేసినప్పుడు కులీ కుతుబ్‌షా ఆకాంక్ష ఇది. మంచి ఉద్దేశంతో కోరుకున్నందున ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. నగరం మహా సంద్రమైంది. కానీ, ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూముల్లో ఫార్మా సిటీనే ఏర్పాటు చేస్తున్నామని సాక్షాత్తూ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో స్పష్టం చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం… అదే భూముల్లోని బేగరి కంచె వేదికగా ఫ్యూచర్ సిటీ అలియాస్ ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. మరి… కోర్టుకు చెప్పిందొకటి! పునాది రాయి వేసినప్పుడు ప్రకటించినది మరొకటి!! అబద్ధాల పునాదులపై ఫ్యూచర్ సిటీకి నాంది పలికారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మా సిటీ భూముల్ని తిరిగి రైతులకు అప్పగిస్తామని ఏకంగా అభయహస్తం మ్యానిఫెస్టోలోనే పొందుపరిచిన ఆ పార్టీ కుర్చీ ఎక్కిన వెంటనే మాట మరిచింది… ఫార్మా రైతులకు మొండిచెయ్యి చూపుతున్నది.
ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలోనే కాదు… విదేశీ పర్యటనల్లోనూ అనేక కంపెనీలకు ఈ ఫ్యూచర్ సిటీలో భూములు కేటాయిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్న రేవంత్ సర్కారు అదనంగా ఒక్క ఎకరా సేకరించలేదు. మరి… ఫార్మా సిటీ భూముల్లోనే ఫార్మా కంపెనీలే ఏర్పాటు చేస్తే మరి ఫ్యూచర్ సిటీకి భూములెక్కడివి? ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేసినట్లు అనేక కంపెనీలకు భూములెక్కడి నుంచి తెస్తారు? ఎవరూ నోరు విప్పరు.. ఎందుకంటే హామీ ఇచ్చినట్లు ఫార్మా రైతులకు తిరిగి భూములను ఇచ్చేయాల్సి వస్తుందేమోనన్న జంకు! ‘ప్రజలెన్నుకున్న ప్రభుత్వం… ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా… అసలు ప్రజలకే నిజాలు చెప్పకుండా… ఇలా దోబూచులాట ఆడటం… ప్రజలే చేజేతులా చేసుకున్న ఖర్మ’ అని ఫార్మా రైతులు ఆవేదన చెందుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం నుంచి ఫార్మా సిటీ ఎప్పుడో పారిపోయింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఫార్మా సిటీ ఉందని కొంతమంది ఇంకా అనుకుంటున్నరు. ఇకపై ఫార్మా భూతమే ఉండదు. ఉంటే గింటే కాలుష్యం లేని ఇండస్ట్రీలు ఉంటయి. ఒకవేళ ఫార్మా ఉంటే ఈ మల్రెడ్డి రంగారెడ్డి గతంలో కంటే మీకు ఎక్కువగా అండగా ఉంటడు.
– భూభారతి అవగాహన సదస్సులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 9,806.05 ఎకరాలు రైతుల వద్ద ఉన్న ప్రైవేటు భూమి కాగా, గతంలో టీఎస్ఐఐసీ రైతుల నుంచి సేకరించిన 400.75 ఎకరాలు, 2,704.90 ఎకరాల ప్రభుత్వ భూమి, టీఎస్ఐఐసీ ఆధీనంలోని మరో 6,209.50 ఎకరాలు, వంద ఎకరాల ట్రాన్స్‌కో భూములతో పాటు 110 ఎకరాల విస్తీర్ణంలో నీటి వనరులు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇందులో దాదాపు 14 వేల ఎకరాల పైచిలుకు భూసేకరణ పూర్తి చేసింది. ఇందులో రైతుల నుంచి సేకరించిన పట్టా భూములు సుమారు 3-4 వేల ఎకరాల వరకు ఉండగా… మిగిలినది సేకరించాల్సి ఉంది.
ఫార్మా సిటీ ఏర్పాటుకుగాను మొదటి దశ అనుమతులు కూడా వచ్చాయి. తుది అనుమతులు రావాల్సి ఉంది. ఫార్మా సిటీలో కంపెనీల ఏర్పాటు కోసం 300-350 కంపెనీలు దరఖాస్తు కూడా చేసుకున్నాయి. అయితే రైతుల నుంచి సేకరించిన పట్టా భూమికి ఎకరాకు రూ.16.50 లక్షల వరకు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.50 లక్షల వరకు పరిహారాన్ని సర్కారు ఇచ్చింది. దీంతోపాటు భూమిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చేందుకుగాను కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1,400 ఎకరాలను సేకరించి.. లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఎకరాకు 121 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాటును కూడా పంపిణీ చేసింది. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను కందుకూరు మండల పరిధిలో 1,400 మంది, యాచారం మండల పరిధిలో 3,600 మందిని గుర్తించారు. వీరిలో సాంకేతిక అర్హతలు లేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డ్రైవ్‌ను కూడా చేపట్టారు.
తుది అనుమతులు రాగానే దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో ప్రాధాన్యత, ఇతర అర్హతల మేరకు భూ కేటాయింపులు జరిగేవి. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ భూముల్లో ఫార్మా సిటీ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆందోళనలు చేసింది. అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామని ప్రకటించింది. అభయహస్తం మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పాదయాత్రలో రైతులకు హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలు నిర్వహించి ఎయిర్‌పోర్టు మెట్రోతో పాటు ఫార్మా సిటీ రద్దుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. మీడియా చిట్‌చాట్‌లోనూ ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ, ఫార్మా సిటీ భూసేకరణ నోటిఫికేషన్‌లోని షరతుల్ని అధికారులు గుర్తుచేయడంతో దానిని అధికారికంగా ప్రకటించకుండా దోబూచులాట మొదలుపెట్టారు. ‘ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు సేకరిస్తున్న భూముల్లో గ్రీన్ ఫార్మా కంపెనీలను మాత్రమే ఏర్పాటు చేస్తాం. నిర్దేశిత అవసరాలకు వినియోగించనట్లయితే తిరిగి భూములు రైతులకు చెందుతాయి’ అనే షరతును నోటిఫికేషన్లోనే కేసీఆర్ ప్రభుత్వం చేర్చింది.
అధికారులు ఈ విషయాన్ని సీఎం రేవంత్ చెవిన వేయటంతో అప్పటి నుంచి సర్కారు హైడ్రామా మొదలైంది. దీనికి బదులుగా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రకటనలు చేస్తారు గానీ, అధికారికంగా ఫార్మా సిటీ రద్దును మాత్రం ప్రకటించరు. క్షేత్రస్థాయిలోనూ అందుకు భిన్నంగా ఫార్మా భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ రహదారులు, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇలా అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. దీనికి తోడు అనేక కంపెనీలకు కూడా ఇందులో భూములు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు అధికారికంగానే ప్రకటిస్తున్నారు.
అయితే ఫార్మా సిటీ భూములు అనకుండా దానికి ఫ్యూచర్ సిటీ ట్యాగ్ తగిలించారు. ప్రభుత్వ చర్యలు, లీకులు, పత్రికా కథనాలను చూసిన రైతులు రాష్ట్ర ప్రభుత్వమే షరతు ఉల్లంఘించినందున తమ భూములు తమకు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ, అక్కడ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో హైడ్రామాకు తెరలేపింది. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో అసలు తాము ఫార్మా సిటీ రద్దు నిర్ణయమే తీసుకోలేదని, ఇదంతా పత్రికల్లో వచ్చిన వదంతులు మాత్రమేనని కొట్టిపారేసింది.
నాగార్జునసాగర్-శ్రీశైలం రాష్ట్ర రహదారుల సరిహద్దుగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఇందులోనే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. కానీ, గత 17 నెలలుగా ఫ్యూచర్ సిటీలో అనేక ప్రాజెక్టులు, కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించింది. మరి… వీటికి భూములు ఎక్కడివి? అనే ప్రశ్నకు మాత్రం ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ… హైకోర్టుకు అఫిడవిట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ… రెండింటినీ తూచ్ అంటూ క్షేత్రస్థాయిలో ఫార్మా భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నది.