హైదరాబాద్, మార్చి 7 : ఎవరికి ఏది చేయాలో అది చేయడం.. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో శ్రీకారం చుట్టడం.. స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం.. ప్రతి ఒక్క వర్గాన్ని.. ఆ వర్గం అవసరాలను పరిగణనలోకి తీసుకొని.. అన్నింటినీ సమగ్రంగా ఆకళింపు చేసుకొని.. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితంగా కేసీఆర్ మార్కు బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెండున్నర లక్షల కోట్ల భారీ పరిమాణంతో.. 35 వినూత్న పథకాలతో ప్రగతి పథగామిగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఒక రాష్ట్రంతో పోలిస్తే.. అభివృద్ధి కోసమైనా.. సంక్షేమం కోసమైనా ప్రత్యేక దృష్టి సారించడానికి అవకాశాలుంటాయి. వనరులు అధికంగా ఉంటాయి. సంతులనంతో సంపద పంపిణీ చేయడానికి ప్రణాళికాబద్ధమైన వ్యవస్థలుంటాయి. కానీ.. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రభావితం చేయలేదు. ఏ ఒక్కరికి కూడా సంతృప్తి కలిగించలేదు. ఏ ఒక్క రంగానికి కూడా ప్రోత్సాహకరంగా లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేక రంగాలను ప్రభావితం చేస్తున్నది. ఆర్థిక మంత్రి ప్రకటించిన దాదాపు 35 నూతన పథకాలు రాష్ట్రంలో పలు వర్గాల అభివృద్ధికి కొత్త దారులు పరుస్తున్నాయి.
కొత్త పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పరిపుష్టం చేయనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యావత్ దేశంలోని దళిత సమాజానికి చుక్కానిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దళిత సమాజం.. సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడమనేది మధ్యకాలిక లక్ష్యంగా కనిపించినప్పటికీ.. దీర్ఘకాలికంగా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ పథకం ద్వారా ఎంతో పరిపుష్టం చెందుతుందనేది నిర్వివాదం. ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అమలుచేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తదారి పట్టించారు. సొంత జాగ ఉంటే చాలు.. ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఏ రాష్ట్రం కానీ.. అన్ని హంగులు ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దిశగా అడుగు వేయలేదు సరికదా.. కనీసం ఆలోచన కూడా చేయలేదు. అసంఘటిత రంగంలో ఉండే భవన నిర్మాణ కార్మికులకు సైతం రాయితీలపై వాహనాలను అందజేసే పథకానికి నాంది పలకడం సంక్షేమ రంగంలో దేశంలోనే ఒక వినూత్న పంథా. విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదే. రాష్ట్రంలో అన్ని రకాల కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా అద్భుతాలే జరుగుతున్నాయి. తాజా బడ్జెట్లో ఇచ్చిన ప్రోత్సాహకాలు.. అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది కేసీఆర్ మార్కు బడ్జెట్ కాబట్టి..