మల్కాజిగిరి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పోరాటంతో గౌతంనగర్ లెవెల్ క్రాసింగ్ వద్ద రూ.42 కోట్లతో ఆర్యూబీ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మల్కాజిగిరి నుంచి గౌతంనగర్ వైపు వెళ్లేమార్గంలో రైల్వే గేటు ఉంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రతిరోజు పలుమార్లు లెవల్ క్రాసింగ్ వద్ద గేటు పడుతుండటంతో వాహనదారుల ఇక్కట్లు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలో ఆర్యూబీ నిర్మించాలని స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ విషయమై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. ఆయన ఆర్యూబీ కోసం పోరాటం చేశారు. రైల్వేశాఖ ఎట్టకేలకు ఆర్యూబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఆసర్వే అధికారులు స్థల పరిశీలన చేశారు. ‘గౌతంనగర్ వద్ద ఆర్యూబీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశాం. తాగునీటి పైపులైన్లు, సీవరేజ్ లైన్లు, డ్రైనేజీ లైన్లు ధ్వంసం కాకుండా పనులు చేపట్టనున్నారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి వస్తే మల్కాజిగిరి నుంచి గౌతంనగర్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి’.. అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.