హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ తీరు కాగితాల్లో ఘనం.. క్షేత్రస్థాయిలో ఘోరం అనే చందంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్లు పంచేసి రికార్డు సృష్టించామని అధికారులు చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎదురొంటున్న వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ దాదాపు వందశాతం పూర్తయినట్టు రికార్డుల్లో చూపిస్తున్న ప్రాంతాల్లో కూడా కనీసం బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) అడుగుపెట్టలేదని ఓటర్లు లబోదిబోమంటున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 99.98 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయింది. 26 జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ వంద శాతం పూర్తి చేశామని అధికారులు కాగితాల్లో లెకలు చూపిస్తున్నారు. ఉన్నతాధికారుల సమీక్షల్లో శభాష్ అనిపించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది చూపించిన ఈ అంకెల గారడీ ఇప్పుడు ఓటర్ల పాలిట శాపంగా మారింది.
అధికారులు వంద శాతం పంపిణీ అని చెప్తుంటే.. నగర, పట్టణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ‘మా కాలనీ, మా ఇండ్లకు అసలు బీఎల్వోలు వచ్చిన దాఖలాలే లేవు. మాకు అందాల్సిన ఎన్యుమరేషన్ ఫామ్లు ఎటు పోయాయి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపకల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, శివారు కాలనీల్లో చాలామందికి ఫామ్లు అందనే లేదు. అధికారులు ఇండ్ల వద్దకు వచ్చి వివరాలు సేకరించకుండానే, ఆఫీసుల్లో కూర్చొని ఫామ్ల పంపిణీ అయిపోయినట్టు టిక్ మారులు పెట్టేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలనే పైఅధికారుల ఒత్తిడికి భయపడి క్షేత్రస్థాయి సిబ్బంది తూతూమంత్రంగా పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మా ఇంట్లో ఆరుగురు ఓటర్లం ఉన్నాం. మేము చదువుకోలేదు. మా దగ్గరకు ఏ ఎన్నికల అధికారులు రాలేదు. అవేవో పత్రాలు నింపి ఇవ్వాలట. వాటిని మా దగ్గరకు ఎవరూ తీసుకురాలేదు. ఎట్ట సారూ… మా ఓట్లు పోతయా?’ అని హైదరాబాద్లోని ఓ కాలనీకి చెందిన వృద్ధురాలు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు.