హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ డబుల్ బొనాంజా కొట్టింది. 2019 ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలువగా.. ఈ దఫా సిట్టింగ్ స్థానాలతో పాటు మరో నాలుగు సీట్లలో పాగావేసింది. తద్వారా కమలం వికాసం ‘రెట్టింపు’ అయ్యిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
2019 ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఈసారి అదనంగా మల్కాజిగిరి, మెదక్, మహబూబ్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భిన్న వాతావరణం కనిపించింది. ఉదయమే రెండు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ చేశారు.