TSRTC | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 2019లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేస్తే ఓర్వలేని బీజేపీ విష ప్రచారానికి దిగింది. నాడు విలీనం చేయాలన్న నోటితోనే నేడు విలీన ప్రకటనకు అడ్డగోలు భాష్యం చెబుతున్నది. విలీనం ఒక మిస్టరీ అని, ఆస్తుల కోసమే ఆర్టీసీని విలీనం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నది.
గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ విలీన బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం.. విలీనం అయ్యేదా? పొయ్యేదా? అన్నట్టుగా ప్రచారం చేస్తున్నది. విలీనం నినాదాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలన్న బీజేపీ విధానానికి సీఎం కేసీఆర్ ప్రకటనతో గండిపడటాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. సీఎం కేసీఆర్ తమ బతుకుల్లో వెలుగులు నింపుతుంటే, బీజేపీ ఇంకా చీకట్లోనే బతకాలన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. 43 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.