BJP | బండి సంజయ్‌ని సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం వల్లనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి కిషన్‌రెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్‌రావు ఇటీవల కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఒకవైపు బీసీని సీఎం చేస్తామని చెబుతూనే మరోవైపు అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగిస్తారా?… అని పెద్ద ఎత్తున వెల్లువెత్తిన విమర్శలకు పార్టీ తరఫున ఆయన వివరణ ఇచ్చారు. కానీ మురళీధర్‌రావు చెప్పింది తప్పు, సీఎం అభ్యర్థి బండి కాదు…తాను అంటూ ఆ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఖండించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా కుల సంఘాల భేటీలో ఆ విషయం వెల్లడించారని ఈటల గుర్తు చేశారు. బండి సంజయ్ ఏమో సీఎం అభ్యర్థిగా తన పేరు ప్రచారం చేయడం వల్లనే ఉన్న పోస్టు ఊడబెరికారని వాపోయారు. బీజేపీ విజయం సాధిస్తే సుస్థిర ప్రభుత్వం అందిస్తామని ఒకవైపు చెబుతూ మరోవైపు ఈ ఇద్దరు సీఎం అభ్యర్థుల గోల ఏంటీ? ఒక పార్టీలో ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటనే చర్చ జరుగుతున్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకే టర్న్‌లో ఇద్దర్ని సీఎంలను చేయడమా?… అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలో యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై ఇద్దర్నీ సీఎంలను చేసిన విషయం తెలిసిందే. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇంకేదో అనుకున్నాం…ఇదా? అని జనం నోరెళ్లబెడుతున్నారు.
-వెల్జాల