హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే నేతల ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీకి కార్యవర్గ కూర్పులో కుమ్ములాటలు కొత్త తలనొప్పిగా మారాయి. రాష్ట్ర అధ్యక్ష, ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవుల్లో ఓసీ వర్గానికి చెందిన రామచందర్రావు, చంద్రశేఖర్ తివారీ కొనసాగుతున్నారు. దీంతో నాలుగు జనరల్ సెక్రటరీ పోస్టులకు తప్పకుండా బీసీలనే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర కార్యవర్గంలో 8మంది ఉపాధ్యక్షులు, 8మంది సెక్రటరీలు, మీడియా ఇన్చార్జి, పార్టీ అధికార ప్రతినిధి, ట్రెజరర్, ఆఫీస్ ఇన్చార్జి పోస్టులు కల్పించనుండగా.. ఆయా పదవుల్లో కొత్త నేతలకు అవకాశం ఇస్తారా..? లేదా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కార్యవర్గంలో 8 మంది మహిళలకు సైతం చోటు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే కీలక పదవుల్లో ఓసీ నేతలు ఉండటంతో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకు కల్పించే స్థానాలపై ఆసక్తి నెలకొంది. మరో ఓసీ నేతకు మాత్రమే కార్యవర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలిసింది.