Bandi Sanjay | వరంగల్/కరీంనగర్/వరంగల్ లీగల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి హనుమకొండ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, మౌటం శివగణేష్పైనా కోర్టు ఇదే నిర్ణయం తీసుకొన్నది. బండి సంజయ్‌తోపాటు మిగతా ముగ్గురిని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులను పోలీసులు బుధవారం సెలవు కావడంతో మేజిస్ట్రేట్ రాపో లు అనిత ఇంటి వద్ద ప్రవేశపెట్టారు. నిందితులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని రిమాండ్ రిపోర్టులో పేరొన్నారు.
నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ పేపర్ లీకేజీ వార్తలను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నదని వివరించారు. అలాగే, ఈ నిందితులపై విద్యార్థులు దాడికి పాల్పడే అవకాశం ఉన్నదని చెప్పారు. వీరిని వదిలేస్తే తిరిగి మళ్లీ నేరం చేసే అవకాశంతోపాటు దర్యాప్తును ప్రభావితం చేసి సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నందున రిమాండ్‌కు తరలించాలని కోర్టును కోరారు. బండి సంజయ్‌ని రిమాండ్ కోసం న్యాయస్థానం ముం దు ప్రవేశపెట్టిన సందర్భంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. సంజయ్‌పై మోపిన నేరాభియోగాల్లో పేరొన్న గరిష్ఠ శిక్ష ఏడేండ్లలోపే ఉండటంతో న్యాయమూర్తి రిమాండ్‌ను ఆమోదిస్తారా? లేక రిమాండ్ తిరసరించి 41 సీఆర్పీసీ ప్రకారం నిందితులకు బెయిలు ఇచ్చే అవకాశాన్ని పోలీసులకే ఇస్తారా? అనే సందేహాలను పటాపంచలు చేస్తూ న్యాయమూర్తి రాపోలు అనిత రిమాండ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. విద్యార్థి జీవితంలో మైలురాయిగా భావించే పదో తరగతి పరీక్షలను రాజకీయ ప్రాబల్యం పెంచుకొనేందుకు, ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఈ కేసులో నిందితులు ప్రయత్నించారని పోలీసులు పేరొన్న విషయాలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితులను 14 రోజుల రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రేవతి వ్యవహరించారు.
కరీంనగర్ జైలుకు సంజయ్
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో రిమాండ్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. వరంగల్ నుంచి బయలుదేరిన సంజయ్ బుధవారం రాత్రి 10:06 గంటలకు కరీంనగర్ జైలుకు చేరుకొన్నారు. పోలీసులు ముందస్తుగా జైలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పకడ్బందీ కాన్వాయ్‌తో బండి సంజయ్‌ని నేరుగా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఆయనతోపాటు మిగిలిన నిందితులను కూడా కరీంనగర్ జైలుకు తరలించారు. వన్‌టౌన్ పోలీ స్ స్టేషన్వద్ద కొంత మంది బీజేపీ నాయకులు కాన్వాయ్‌ని అడ్డుకొనేందుకు యత్నించారు. దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొన్నారు. జైలు పరిధిలోని రోడ్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు అల్లర్లు, గొడవలు సృష్టించకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకొన్నారు.
‘బండి’పైకి చెప్పులు!
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులను పోలీసులు జిల్లా కోర్టుకు తరలించే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకొన్నాయి. బండి సంజయ్ ఉన్న వాహనం కోర్టు గేట్లోకి వెళ్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువకులు అడ్డుకొని, వాహనంపైకి చెప్పులు విసిరారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. అయినప్పటికీ యువకులు పోలీసు కాన్వాయ్ వెంట పరుగెత్తి ‘బండి సంజయ్ డౌన్ డౌన్’, ‘బండి..తెలంగాణ ద్రోహి’ అంటూ నినదిస్తూ చెప్పులు విసిరారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వాహనాలను స్పీడ్‌గా కోర్టు గేట్‌నుంచి లోపలికి పంపించారు. అంతకుముందు కొందరు బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా పోలీసులతో గొడవకు దిగారు. ఒకదశలో కోర్టు ఆవరణలోకి వెళ్లి హంగామా చేశారు. కోర్టులోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించారు. కోర్టు మెయిన్ గేటు వద్ద కొందరు బీజేపీ నాయకులు, మహిళా నాయకులు పోలీసులను నెట్టివేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను నెట్టివేసే ప్రయత్నం చేయగా, పోలీసులు నిలువరించారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలించారు.
ఏ1- బండి సంజయ్ కుమార్ (51)
ఏ2- బూరం ప్రశాంత్ (33)
ఏ3 – గుండెబోయిన మహేశ్ (37)
ఏ4- మైనర్
ఏ5- శివగణేశ్ (19)
ఏ6- పోగు సుభాష్ (41)
ఏ7- మైనర్
ఏ8-మైనర్
ఏ9- పెరుమాండ్ల శ్రామిక్ (నాని) (20)
ఏ10- పోతబోయిన వర్షిత్ (చందు)(19)