బీఆర్ఎస్.. ఆత్మగౌరవ ప్రతీక.. ప్రజాఉద్యమ పతాక. ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేయబడిన ఆకాంక్షల మధ్య 2001లో జలదృశ్యంలో పురుడుపోసుకున్న గులాబీ జెండా.. పాతికేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది. పోరాటంలో నైనా, పాలనలోనైనా తన పటిమను చూపింది. అగాధాలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. ఆ పతాకం తలవంచలేదు. ఎత్తిన పిడికిలి సడలనివ్వలేదు. అందుకే గులాబీ జెండా ప్రజలకు ఓ గుండెధైర్యం! తెలంగాణకు ఓ భరోసా! 25 వసంతాల బీఆర్ఎస్ నేడు 26వ పడిలోకి అడుగుపెడుతున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో బీఆర్ఎస్ పురుడుపోసుకున్నది. 25 ఏండ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డది. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో 60 ఏండ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లు పాలించి అద్భుతాలు సృష్టించింది. అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది.
సింహగర్జన నుంచి రాష్ట్ర సాధన దాకా
పెంచిన కరెంట్ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పొట్టనబెట్టుకున్నది. ఈ పరిణామంతో కలతచెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ 27న కరీంనగర్ సింహగర్జన సభ వేదికగా స్వరాష్ట్రం కోసం రణగర్జన చేశారు. ఆనాడే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ను ప్రకటించారు. ఆ పార్టీ పుబ్బలో పుట్టి మఖలో మాయమవుతుందని అప్పటి పాలకులు వెక్కిరించినా కేసీఆర్ వెనుదిరిగి చూడలేదు. రాజకీయ ఎత్తుగడలతో ఉమ్మడి పాలకుల కుట్రలను తుత్తునియలు చేశారు. ఓవైపు నాలుగుకోట్ల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అలుపెరుగని పోరు, రాజకీయ చాణక్యంతో ముందుకుసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని ప్రత్యేక తెలంగాణను యూపీఏ ఎన్నికల ప్రణాళికలో చేర్పించారు. రాష్ట్రపతి నోటినుంచి చెప్పించారు. ఆయన వ్యూహాత్మక ఎత్తుగడల ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి 2009 డిసెంబర్9న ప్రకటన చేసింది. అయితే సమైక్య పాలకుల రాజీ‘డ్రామాల’ పన్నాగంతో మళ్లీ వెనక్కిపోయింది. ఈ క్రమంలో మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగి, అన్ని పార్టీలను ఏకం చేసి, తెలంగాణలో ప్రతిఊరినీ ఉద్యమక్షేత్రంగా మార్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ముద్డాడారు కేసీఆర్.
కష్టాలను అధిగమించి..వెలుగులు నింపి..
2014లో తెలంగాణ ప్రజల మద్దతుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో చుట్టుముట్టిన సమస్యలను తన పాలనాదక్షతతో ఒక్కొక్కటిగా అధిగమించారు. కరెంట్ కష్టాలను గట్టెక్కించారు. 24 గంటల కరెంట్‌తో నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని శాపనార్థాలు పెట్టిన అప్పటి సమైక్య పాలకుల కండ్లు తెరిపించారు. మిషన్ కాకతీయకు అంకురార్పణ చేసి 46 వేల చెరువులను పునరుద్ధరించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లానీరందించారు. బిడ్డల పెండ్లి చేసేందుకు ఇబ్బందులు పడుతున్న నిరుపేద తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మితో సాంత్వన కలిగించారు. అదునుకు రైతుభరోసా ఇచ్చి అన్నదాతల బతుకుల్లో మార్పులు తెచ్చారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయ రంగ రూపురేఖలనే మార్చివేశారు. గొర్రె పిల్లలు, చేపపిల్లల పంపిణీ పథకాలతో వృత్తిదారులకు కొత్త దారి చూపారు. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచి వృద్ధులు, దివ్యాంగుల కండ్లల్లో ఆనందం నింపారు.
25 ఏండ్లో అనేక ఆటుపోట్లు
25 ఏండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నది. అధినేత కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహాలతో వాటిని పటాపంచలు చేస్తూ ముందుకుసాగారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి లాంటి ఉద్ధండులైన ముఖ్యమంత్రులను ఎదురించి అప్రతిహతంగా ప్రత్యేక పోరాటాన్ని నడిపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీని మాయంచేసే కుట్రలకు తెరలేపారు. కానీ కేసీఆర్ ఏనాడూ వెన్నుచూపలేదు. ప్రజాక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. ఇక 2023లో అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పనైపోయిందని, ఇక కోలుకోదని కొందరు దుష్ప్రచారం మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం ఎదురుకాగానే ఇక బీఆర్ఎస్ కనుమరుగైనట్టేనని రాక్షసానందం పొందారు. కానీ కేసీఆర్ చాణక్యం, కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారిలాంటి వారి పోరాట పటిమతో మళ్లీ బూడిద నుంచి ఫినిక్స్ పక్షిలా బీఆర్ఎస్ ఎగిరివస్తున్నది. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతూ, సర్కార్ వైఫల్యాలు ఎండగడుతూ, ప్ర భుత్వ అక్రమ వ్యవహారాలు బట్టబయలు చే స్తూ ప్రజాదరణను చూరగొంటున్నది. మరోసారి అధికారం దిశగా అడుగులు వేస్తున్నది.
ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామగ్రామన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీ లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, సభ్యులు, జిల్లాల అధ్యక్షులు మొత్తంగా 305 మందిని ఆహ్వానించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు.
ఊరూరా గులాబీ జెండాలు ఎగరేయాలి ; ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలికేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడు పార్టీ ప్లీనరీని రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్టు వివరించారు. ఈ మీటింగ్‌కు పరిమిత సంఖ్యలోనే ఆహ్వానం పంపించామని వెల్లడించారు. ఆహ్వానం ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఆహ్వానం లేనివారు ఇక్కడికి వచ్చి నిరాశ చెందవద్దని విజ్ఞప్తిచేశారు. ఆహ్వానం ఉన్న నాయకులు ఉదయం తమ ఏరియాల్లో జెండా పండుగలో పాల్గొని, మధ్యాహ్నం 1:30 గంటల్లోగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సూచించారు.
జెండా ఎగురవేయనున్న కేటీఆర్
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.