హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష రాజకీయాలు పెరుగుతున్న తరుణంలో గాంధీజీ చెప్పిన శాంతి, మత సామరస్యం నేటికీ ఎంతో అవసరమని చెప్పారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.
గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. గ్రామాలే దేశానికి వెన్నెముక అన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిందని గుర్తుచేశారు. మహాత్ముడు కలలుగన్న వివక్ష లేని సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని నాయకులు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేనందగౌడ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు సుమిత్రాఆనంద్, రజిత, మమత, కుర్వ విజయ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.