కాజీపేట, డిసెంబర్ 26: హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, రాష్ట్ర విద్వత్ సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి (60) మంగళవారం శివైక్యం చెందారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన ఈయన కుటుంబం గతంలో హనుమకొండ జిల్లా ఉనికిచర్లకు వలస వచ్చింది. ఈయన భద్రకాళి దేవస్థానానికి 10 ఏండ్లకుపైగా ఆస్థాన సిద్ధాంతిగా కొనసాగుతూ పంచాంగాన్ని రాస్తున్నారు. ఆయన అభిరుచులు సిద్ధాంతభాగం గణితం, పురోహితం, ఆధ్యాత్మిక బోధన చేసేవారు.
తెలంగాణ రాష్ట్ర విద్వత్ సభకు కొంతకాలంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మల్లయ్యశర్మ సిద్ధాంతి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన తల్లి పుష్పలత మరణించడంతో అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం పరమపదించారు. ఆయన మరణవార్త భక్తులను శోకసంద్రంలో ముంచింది. కాజీపేట పట్టణంలో బుధవారం అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు భక్తులు తెలిపారు. ఈయనకు భార్య శారదాదేవి, ఇద్దరు కుమారులు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ ఉన్నారు.