హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): దేశంలో 28 గేట్వేలు ఉన్నాయని (రాష్ర్టాలు), పెట్టుబడులకు మంచి గేట్వేలను ఎంచుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మన దేశానికి ప్రతిబింబం వంటి ఐఎఫ్ఎస్ అధికారులు ఉత్తమ విధానాలున్న రాష్ర్టాల్లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రొత్సహించాలని సూచించారు. సోమవారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో సీనియర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై ప్రసంగించారు.
దేశంలోని 28 రాష్ర్టాల్లో 28 రకాల భారత్‌ను చూడగలమని, ప్రతి 150 కిలోమీటర్లకు ప్రత్యేక వాతావరణం, ఆహారపు ఆలవాట్లు ఉండటం మన దేశ ప్రత్యేకతగా అభివర్ణించారు. పారిశ్రామిక అనుకూల విధానాలు అనుసరిస్తున్న రాష్ర్టాలే పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారానే తెలంగాణ అధికంగా పెట్టుబడులను రాబట్టగలిగిందని చెప్పారు. రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం ప్రస్తుతమున్న కంపెనీలు పెట్టినవేనని ఉదహరించారు. రాష్ట్రంలోని పెట్టుబడిదారులు సంతోషంగా ఉంటే, వారే రాష్ర్టానికి పెద్ద అంబాసిడర్లని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, దానిని అక్షరాల ఆచరిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కంపెనీ నెలకొల్పిన ఫిక్కీ పూర్వ చైర్మన్, హెచ్ఎస్ఐఎల్ కంపెనీ చైర్మన్ సందీప్సుమానీ తెలంగాణ ఏర్పడిన తరువాత 8 సంస్థలను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. తాము ఇన్వెస్టర్లకు కల్పిస్తున్న భరోసాకు ఇదే ఉదాహరణ అని చెప్పారు.
తెలంగాణ పవర్‌హౌజ్
తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నోట్లరద్దు, లాక్డౌన్, కరోనా, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆర్థికంగా పవర్‌హౌజ్‌గా నిలిచిందని వివరించారు. రిజర్వ్‌బ్యాంకు నివేదిక ప్రకారం తెలంగాణ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రమైనా, ఆర్థికరంగంలో దేశంలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టిక్, ఏరోస్పేస్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, డిఫెన్స్ వంటి రంగాల్లో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని తెలిపారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతిపొందిన యూనిట్లు తెలంగాణలో మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశంలో అతిపెద్దదైన టీ-హబ్‌ను ఐఎఫ్ఎస్ అధికారులు సందర్శించాలని ఆహ్వానించారు. ప్రొటోటైట్స్ హబ్‌గా టీ-వర్క్స్, మహిళల కోసం వీ- హబ్‌ను ఏర్పాటు చేశామని, టీ- హబ్ 2ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ముఖాముఖిలో ఐఎస్బీ డీన్ పిల్లుట్ల మదన్, పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు.
హోలిస్టిక్ మోడల్‌తో..
రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తెలంగాణ లోటు కరెంట్ రాష్ట్రమని, పవర్ హాలిడేస్ ప్రకటించిన రోజులున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. గత ఏడేండ్లల్లో జీఎస్డీపీ 125 శాతం పెరిగిందని, రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ మోడల్‌తో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన ఆదాయ వనరులైన ఐటీ, వ్యవసాయరంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరుకోగా, వ్యవసాయ రంగం 119 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటడంతో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన సంసద్ ఆదర్శ్ యోజన అవార్డుల్లో టాప్-20లో 19 తెలంగాణకు వచ్చాయని గుర్తుచేశారు. పట్టణభివృద్ధిలోను 12 అవార్డులను దక్కించుకున్నామని వివరించారు.