కరీంనగర్: వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అకాల వర్షం కురిసిందని, ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుంచి 20 శాతం మాత్రమే పంట నష్టం జరిగేదని, ఇప్పుడు మాత్రం వందకు వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఎకరానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, ధాన్యాన్ని ఎటువంటి ఆలస్యానికి తావులేకుండా కొనుగోలు చేస్తామని చెప్పారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్షెడ్, గోపాల్ పూర్ గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మంత్రి గంగుల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట నేల పాలవడం బాధాకరమన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు.
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం 20 వరకు వస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించినట్లు తెలిపారు. పొలాల దగ్గరే పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందని, అన్నదాతలు అధైర్యపడవద్దని మంత్రి చెప్పారు. వర్షాలతో తడిసిన ధాన్యం తొందరగా ఎండే పరిస్థితి లేకపోవడంతో తేమ శాతం పరిమితిని 17 నుంచి 20కి సడలించాలని ఎఫ్సీఐని కోరినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటికే రూ.1350 కోట్ల విలువైన సుమారు 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.