హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : బీసీ ఉద్యోగుల సమాచారమివ్వాలని అడిగినా వివిధ ప్రభుత్వశాఖలు ఇవ్వడం లేదని రాష్ట్ర బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన సభ్యులు గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించినా చాలా శాఖలు ఇవ్వలేదని పేర్కొంది. 25న ప్రభుత్వశాఖల కార్యదర్శులతో ఈ విషయమై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలపై ఒక ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. కులగణన వివరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో మతంతో సంబంధం లేకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తున్నదని కమిషన్ తెలిపింది. బీసీ ఈ గ్రూప్‌లో కూడా ముస్లింలకు అదే తరహాలో రిజర్వేషన్ కల్పిస్తుందని కమిషన్ స్పష్టంచేసింది.