హైదరాబాద్, డిసెంబర్5 (నమస్తే తెలంగాణ): ‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం వృథాకాదని, 42శాతం బీసీ రిజర్వేషన్ అమలయ్యేందుకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లలో లోపాలున్నాయని చెప్పినా పట్టించుకోకుండా, వాటిని సవరించకుండా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరమని అసహనం వ్యక్తంచేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించేవరకూ పోరాడాలే తప్ప, ఎవరూ ఆత్మబలిదానం చేసుకోవద్దని చెప్పారు. 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైందని, తుదకు 21.39 శాతం రిజర్వేషన్లే అమలు కావడంపై బీసీలు ఎంత మానసిక ఆవేదనకు గురవుతున్నారో చెప్పడానికి ఈశ్వరాచారి మరణమే నిదర్శనమని పేర్కొన్నారు. సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.25 లక్షల పరిహారం అందించాలని ఆయన కోరారు.