నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 13: ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా కొంప ముంచుతున్నది.. వెంటనే ఆ పథకాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు.
కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కామారెడ్డి – కరీంనగర్ ప్రధాన రహదారిపై గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ర్యాలీ తీశారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, సూరేపల్లి, పేరూరు రూట్లలో నడిచే ఆటో డ్రైవర్లు ఆటోలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేశారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఆటోలను నిలిపి యూనియన్ నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్‌లోని నయాబాది చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్, ధర్పల్లి మండల కేంద్రాల్లో, నిజామాబాద్ నగరంతోపాటు కామారెడ్డి జిల్లా జుక్కల్, రామారెడ్డి మండలం రెడ్డిపేట, దోమకొండలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు.
ఆయా చోట్ల వారు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామని చెప్పారు. అప్పు చేసి ఆటోలు కొనుక్కున్నామని ఇప్పుడు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో చార్జీలు పెంచండి
హిమాయత్‌నగర్, డిసెంబర్ 13: పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పెట్రో ల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచడంతో ఆటో కార్మికులపై భారంపడి జీవనోపాధికి ఆటకం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో, మోటార్రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, గ్రేటర్లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.