డొక్కలు ఎండిన నిరుపేద ఆకలి తీర్చాలి. నిండు మనుసు ఉన్న వ్యక్తికి ఆ నిరుపేద ఆకలి తీర్చే అదృష్టం కలిగింది. చేతికి ఏది అందితే అది పెట్టి అతడి ఆకలి తీర్చాలనుకున్నాడు. ఆ క్రమంలో ముందు మజ్జిగ పోశాడు. ఆతర్వాత పప్పు వేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు చేతనైనంత చేసి ఆ అభాగ్యుడి ఆకలి తీర్చాడు. తన జీవితం చరితార్థం అయిందని సంతోషపడ్డాడు.
ఇంకో వ్యక్తి వచ్చాడు. అన్నం పెట్టే విధానం ఇదేనా? ముందు పప్పు పెట్టాలి, ఆతర్వాత చారు పోయాలి.. చివరకు మజ్జిగ ఇయ్యాలి. ఇది కదా అన్నం పెట్టే తీరు అని తప్పు పట్టాడు. పద్ధతి పాటించలేదని శాపనార్థాలు పెట్టాడు. ఊరి పెద్దలను పురమాయించి అభాగ్యుడి ఆకలి తీర్చిన వ్యక్తిపై నిందలు వేయించాడు. ఇంత పెద్ద మనిషివి ఇదేనా ఆకలి తీర్చే పద్ధతి అంటూ ఊరందరి ముందు పంచాయితీ పెట్టించాడు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేసీఆర్‌పై రేవంత్ సర్కారు తీరు ఇలానే ఉంది. ఆరు దశాబ్దాల సాగునీటి గోస తీర్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిని తప్పు పడుతున్నది. పప్పు కంటే ముందు మజ్జిగ ఎలా పోస్తావంటూ నిలదీస్తున్నది. మూడేండ్లలో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తావంటూ నీలాపనిందలు వేస్తున్నది. చేసిన పనిలో రంధ్రాన్వేషణ చేసి రైతులకు సాగునీరు అందించడమే అతి పెద్ద తప్పుగా అభివర్ణిస్తున్నది. ఆదివారం అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘోష్ కమిషన్ నివేదిక కూడా సరిగ్గా అట్లనే అనిపిస్తున్నది.
జీవితంలో సాగునీటికి నోచుకోని లక్షలాది ఎకరాలను పచ్చని మాగాణం చేసిన నిండు మానవత్వాన్ని విస్మరించి, రెండు పిల్లర్లు కుంగినందుకు తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడు అనే పాత కక్షల కుంచితత్వాన్ని పాలకులు ప్రదర్శిస్తున్నారు. పాలకుల నోటిలో నుంచి వచ్చిన ఆరోపణలు, కేసీఆర్ ప్రభుత్వం వేసిన ప్రతి అడుగును వెక్కిరించే రీతిలో సాగిన వెటకారాలు, అంతకుమించి కాంగ్రెస్ సర్కారు మనోభావానికి అద్దం పట్టే రీతిలో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని సంధించిన అస్ర్తాలు 665 పేజీల్లోని ప్రతి పేరాగ్రాఫ్లోనూ కనిపిస్తాయి.
నిందారోపణలు చేయడమే లక్ష్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చినట్టు తెలిసిపోతున్నది. నివేదిక సారాన్ని పరిశీలిస్తే వక్రీకరణలు, అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశాలు తప్ప మరేవీ కనబడటం లేదని నిపుణుల అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అర్థం లేని ఆరోపణలనే కమిషన్ తన నివేదికలో పునరావృతం చేసింది తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్‌ను రివ్యూ చేయడం ఆయన బాధ్యత. ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం ఒక బాధ్యతాయుత ప్రభుత్వం చేసే పని. దానిని ఇది రాజకీయ జోక్యమంటూ కమిషన్ అభివర్ణించిందంటే నివేదిక ఉద్దేశమేమిటో, దాని లక్ష్యమేంటో తేటతెల్లమవుతున్నది. రంధ్రాన్వేషణ తప్ప రిపోర్టులో ఎక్కడా నిజాయతీ కనిపించిన దాఖలాల్లేవు.
ఘోష్ కమిషన్‌లో చేసిన ప్రధాన ఆరోపణ.. 2016లో మూడు బరాజ్‌ల పనులు మొదలుపెట్టి 2018లో కేంద్ర జల సంఘానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించడం అతి పెద్ద నేరం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే జలయజ్ఞంలోని ప్రాజెక్టుల్లో 99 శాతం ప్రాజెక్టులకు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా డీపీఆర్‌లను సమర్పించిన దాఖలాల్లేవు. అసలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టులు తప్ప ఏదైనా రాష్ట్రం తన సొంత నిధులతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులకు అవసరమైన వివరాలు తప్ప డీపీఆర్, ఇతరత్రా నివేదికలు ఇచ్చే సంప్రదాయం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే వరుస. ఇప్పుడు పొరుగు రాష్ర్టాల్లోనూ ఇదే తీరు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే తాపత్రయంతో కేసీఆర్ ప్రభుత్వం పరుగులు పెడితే దానిని తప్పుగా అభివర్ణించడం ఎంత వరకు సమంజసం?
కమిషన్ రిపోర్టులో ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం నిజాయతీ (హానెస్ట్)గా లేదని, విశ్రాంత ఇంజినీర్లు (నిపుణుల కమిటీ) మేడిగడ్డను వద్దన్నదని, క్యాబినెట్ ఆమోదం లేదంటూ కమిషన్ తప్పుడు భాష్యం చెప్పింది. వాస్తవంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం నాటి ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) 2015 ఫిబ్రవరి 2న ఒక లేఖ, మార్చిలో మరో లేఖను రాష్ర్టానికి రాసింది. హైడ్రాలజీ నిపుణలు చెప్పిన లెక్కల ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు అవసరాలకు నికర జలాలు లేవని, కాబట్టి ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సీడబ్ల్యూసీ ఆ లేఖల్లో సూచించింది.
ఒక నదిలో 100 టీఎంసీల నీళ్ల ప్రవాహం ఉన్నదంటే 75 టీసీఎంలను మాత్రమే నిఫుణులు ప్రమాణికంగా తీసుకుంటారు. తమ్మిడిహట్టి దగ్గర చెప్పిన 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉన్నది. ఇందులో ఎగువ రాష్ర్టాలకు చెందిన 63 టీఎంసీలు వారు తీసుకుంటే 102 టీఎంసీలు ఉంటాయని తెలిపింది. ఎగువ రాష్ర్టాలు కేటాయించిన దానికన్నా ఎక్కువగా వాడుతున్నందున 102 టీఎంసీలు కూడా ఉండే అవకాశం లేదని తేల్చిచెప్పింది. తమ్మిడిహట్టి వద్ద సరిపడా నీళ్లు లేనందున సమీక్షించుకోండి, ప్రత్యామ్నాయం చేసుకోండి అని ఆ రెండు లేఖల్లో సీడబ్ల్యూసీ చాలా స్పష్టంగా చెప్పింది.
మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ ఏడేండ్లు అధికారంలో ఉన్నప్పుడు సైతం అదే చెప్పింది. అయినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర ఇంజినీర్లు అనేకమార్లు వెళ్లి చర్చలు జరిపినా మహారాష్ట్ర పట్టువీడలేదు. ఇంకోవైపు ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలం వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే పదేండ్లు అయినా రాదు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే ప్రాజెక్టు సైట్‌ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదు.
ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపారు. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయి. ఈ డీపీఆర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఏడాది కాలంలోనే 11 రకాల అనుమతులు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సిన్సియర్‌గా లేకపోతే ఇన్ని అనుమతులు కేంద్రం ప్రభుత్వం ఎలా ఇస్తుంది? అయినప్పటికీ కమిషన్ హానెస్ట్ లేదని తప్పుబట్టడం చూస్తే కేవలం రాజకీయ ప్రేరేపిత ఉద్దేశమే తప్ప మరేమీలేదని తెలిసిపోతున్నది. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ వాటర్ కమిషన్‌ను, బ్రూరోక్రాట్లను సైతం కమిషన్ తప్పుపట్టడం చూస్తే నివేదికలో ఎక్కడా నిజాయతీ లేదనేది స్పష్టమవుతున్నది.
బరాజ్‌లు అనేవి కేవలం నీటి డైవర్షన్ కోసమే. తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను అధిక నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఇది సాధారణ డిజైన్‌కు వ్యతిరేకం. కేవలం పబ్లిసిటీ కోసమే బరాజ్‌ల్లో నీళ్లను నిల్వ చేశారు. పర్మియబుల్ ఫౌండేషన్‌పై నిర్మించడం వల్లనే బరాజ్‌లు కుంగిపోయాయి. ఇది కమిషన్ నివేదిక సారాంశం. ఇది పూర్తిగా అబద్ధం. దేశంలో 10 టీఎంసీలను మించిన నీటినిల్వ సామర్థ్యంతో కట్టిన బరాజ్‌లు చాలా ఉన్నాయి. ఇదేదీ సాధారణ డిజైన్‌కు వ్యతిరేకం కానే కాదు. అన్ని చోట్లా అమలవుతున్నదే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే జూరాల బరాజ్‌ను 11 టీఎంసీలతో ప్రతిపాదించింది.
భూసేకరణ చేయకపోవడం, అంతరాష్ట్ర సమస్యల కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలనే నింపుతున్నారు. మరెందుకు అనాడు ఎక్కువ సామర్థ్యంతో జూరాలను ప్రతిపాదించారు.? అదీగాక గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించే వెసులుబాటు ఉన్న చోట బరాజ్‌లను తక్కువ సామర్థ్యంతో నిర్మిస్తారు. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. నీటిని ఎత్తిపోసుకోవాలి. అందుకు నిర్ణీత లెవల్‌ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ చేయడం తప్పనిసరి. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను సీడబ్ల్యూసీకి సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్‌లో విపులంగా వివరించారు. బరాజ్‌ల నిర్మాణ డిజైన్లను కూడా ఇచ్చారు.
సీడబ్ల్యూసీ కూడా వాటన్నింటినీ పరిశీలించి అనుమతిలిచ్చింది. మరి నీటినిల్వ సామర్థ్యంపై సీడబ్ల్యూసీ ఎందుకు అభ్యంతరం తెలపలేదు? ప్రశ్నించలేదు? సాంకేతిక పరమైన అంశాల్లో సీడబ్ల్యూసీ కంటే మించి కమిషన్‌కు అనుభవమున్నదా? ఎండిన ప్రధాన గోదావరి నిండుగా ఉండాలని, పునర్జుజ్జీవం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే బరాజ్‌లను నిర్మించారు. మరి అలాంటప్పుడు నీరు నిల్వ చేయకుండా ఉంటారా?
అది పబ్లిసిటీ ఎలా అవుతుంది? ఇక పర్మియబుల్ ఫౌండేషన్ వల్ల బరాజ్ కుంగిపోయిందనేది కూడా బరాజ్‌ల గురించి అవగాహన లేనివారు చేసే వాదనే. దేశంలో ఓఖ్లా, వజీరాబాద్, ఫరక్కా, కోటా, దుర్గాపూర్ తదితర అనేక బరాజ్‌లను కూడా అదేరకమైన పర్మియబుల్ ఫౌండేషన్ మీదనే నిర్మించారు. వాటిలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఇకడ కూడా మేడిగడ్డలో ఒకే ఒక బ్లాక్‌లో3 పియర్స్‌కు క్రాక్ వచ్చాయి. అదీ బరాజ్ అప్స్ట్రీమ్లోనే. డౌన్ స్ట్రీమ్‌లో కాదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయమని ముఖ్యమంత్రి, మంత్రులు తరహాలోనే కమిషన్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే నివేదిక ఎంత ఏకపక్షంగా ఇచ్చిందో అర్థమవుతున్నది. ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సంబంధించి సమీక్షించడం ముఖ్యమంత్రి బాధ్యత. రాష్ట్రంపై ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న వారేవరైనా అదే చేస్తరు. ఎక్కడైనా సరే ప్రాజెక్టును సమీక్ష చేయకపోవడాన్ని తప్పు పడతారు. కానీ చరిత్రలో మొదటిసారి సమీక్షించడాన్ని సైతం తప్పుబట్టిన కమిషన్ ఇదే. రివ్యూ చేస్తే రాజకీయ ప్రమేయమని చెప్పడం అసంబద్ధం. అర్థరహితం.
అంతేకాదు హడావుడిగా అనుమతులు మంజూరు చేయడంలో తొందరపడటంలో ఔచిత్యమేమీ కనబడడం లేదని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ తప్పుబట్టింది. ఆ తొందర కమిషన్‌కు, కాంగ్రెస్‌కు అర్థం కాదు. తెలంగాణ ప్రయోజనాలు, తండ్లాట తెలిసిన వాళ్లకే ప్రాజెక్టు పూర్తికి తొందరపాటు ఎందుకో అర్థమవుతుంది. దశాబ్దాల పాటు నీళ్లు లేక, కరువు కాటకాలతో, వలసలతో, రైతుల ఆత్మహత్యలతో కునారిల్లి, సంక్షోభంలో కూరుకుపోయింది తెలంగాణ.
స్వరాష్ట్రంలోనే బతుకులు బాగుపడతాయని విశ్వసించి ఏండ్లపాటు తెగించి పోరాడింది. ఆ ఆరాటాలు, పోరాటాలు, ప్రజల ఆశయాలు నెరవేరాలా? వద్దా? అందుకే నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తిగా, ఉద్యమించి, ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు నీళ్లివ్వాలని తపనపడ్డ వ్యక్తి కేసీఆర్. తొందరగా పూర్తిచేసి నీళ్లదించాలని ఆరాటపడ్డారు. ఆ తొందరపాటును, ప్రాజెక్టును సమీక్షించడాన్ని చూపుతూ పూర్తి నిర్ణయానికి ఆయనే బాధ్యుడని చెప్పడం చూస్తుంటే నివేదిక ఎంతటి కుత్సిత ఆలోచనలతో కూడుకున్నదో తెలిసిపోతున్నది.
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలని హైపర్ కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చెప్పలేదని, ఆ నివేదికలను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని కమిషన్ తప్పుబట్టింది. కాంగ్రెస్ ఏవైతే చెప్తున్నదో ఆ విషయాలకు అనుగుణంగా కమిషన్ సైతం నిపుణుల కమిటీ రిపోర్టును వక్రీకరించి చూసిందే మరేమీలేదని తేలిపోతున్నది. అదే రిపోర్టుపై సదరు కమిటీ సభ్యులు స్వయంగా హాజరై నివేదించిన అంశాలను సైతం కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం చూస్తే కమిషన్ దురుద్దేశం తేటతెల్లమవుతున్నది.
వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం 2015లో జీవో నంబర్ 28ద్వారా ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏరియల్ సర్వే నిర్వహించి 18 పేజీల రిపోర్టు సమర్పించింది. ఆ నివేదికలోని 7వ పేజీలో చాలా స్పష్టంగా తెలియజేసింది. మేడిగడ్డ వద్ద ఎలాంటి ముంపు లేకుండా 105 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్‌ను నిర్మించవచ్చని చెప్పింది. 8వ పేజీలో మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా జలాల తరలింపు అసాధ్యమని తెలిపింది.
తాడిచర్ల బొగ్గుగనులు, సింగరేణి బొగ్గుగనులు, ఎన్టీపీసీ, అటవీప్రాంతం నేపథ్యంలో మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు జలాలను తరలించలేమని రిటైర్డ్ ఇంజినీర్లు వివరించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ తరహాలోనే కమిషన్ సైతం తప్పుగా వక్రీకరించింది. ఆ కమిటీ మొత్తంగా మేడిగడ్డనే వద్దన్నదని పదేపదే చెప్పింది. ఆ రిపోర్టును పరిగణలోకి తీసుకోలేదని చెప్పడమే కమిషన్ ఉద్దేశమని అర్థమవుతున్నది. వాస్తవమేమంటే కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకున్నది కాబట్టే కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు జలాలను తరలించకుండా గోదావరి నదీగర్భం ద్వారానే జలాలను ఎల్లంపల్లి వరకు తరలించాలని నిర్ణయింది.
ఇక్కడ మరో విషయం ఏమంటే ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లలో ఒకరు ఆ నివేదికపై సంతకమే పెట్టలేదు. ఇదిలా ఉంటే ఆ కమిటీలోని ముగ్గురు విశ్రాంత ఇంజినీర్లను సైతం కమిషన్ విచారించింది. ఆ కమిటీలోని ముగ్గురు సభ్యులు స్వయంగా ఘోష్ కమిషన్ ఎదుట హాజరై అఫిడవిట్ సమర్పించారు. అదే విషయాన్ని ప్రస్తావించింది. తాము రిపోర్టు సమర్పించేనాటికి తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని, సీడబ్ల్యూసీ రాసిన లేఖలు తమ దృష్టికి రాలేదని కూడా స్పష్టం చేశారు. కానీ కమిషన్ మాత్రం ఈ విషయలేవీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ తరహాలోనే విశ్రాంత ఇంజినీర్ల కమిటీ రిపోర్టును వక్రీకరించి అభాండాలు మోపింది.
ప్రాజెక్టుకు అనుమతులు లేవని ఒక చోట చెప్పిన కమిషనే అనుమతులున్నాయని మరోచోట వెల్లడించింది. అనుమతులు రాకముందే 2016లో పనులను చేపట్టారని, రివైజ్డ్ ఎస్టిమేషన్లకు క్యాబినెట్ అనుమతులు లేవని వెల్లడించింది. కానీ అదే కమిషన్ 574వ పేజీలో క్యాబినెట్ అప్రూవల్ ఉందని పేర్కొంది. అదేమంటే 2016లో బరాజ్ నిర్మాణానికి ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. పనులను అప్పగించిందని తెలిపింది. కానీ 2018జూలై నాటికి ప్రాజెక్టు సైట్‌ను అప్పగించలేదని ఎల్అండ్టీ, నవయుగ, ఆప్కాన్స్ సంస్థలు లేఖలు రాశాయని కమిషనే ఉటంకించింది.
ప్రాజెక్టు సైట్‌నే అప్పగించకుంటే పనులు ఎక్కడ ప్రారంభించినట్టు. ఇదిలా ఉంటే బరాజ్‌ల రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ చేస్తూ మే19, 2018లో జీవోలు ఇచ్చారని, దానిని క్యాబినెట్ 2018 మే 27లో ఆమోదించిందని కమిషనే వెల్లడించింది. క్యాబినెట్ అప్రూవల్ ఉందని కమిషనే అంతకుముందు చేసిన అప్రూవల్ లేదన్న వాదనలు తప్పని తన నివేదికలోనే నిర్ధారించింది. స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ చేసినా తరువాత క్యాబినెట్, ఆ తరువాత జీవో ఇవ్వాలని, బిజినెస్ రూల్ అని కమిషన్ చెబుతున్నది.
ముందుగా అప్రూవల్ ఇచ్చి ఆ తరువాత క్యాబినెట్ ర్యాటిఫికేషన్ తీసుకోవడం కూడా బిజినెస్ రూలే. కానీ కమిషన్ మాత్రం తప్పుబట్టడమే విచిత్రం. ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవల్స్ మాత్రమే కాదు, అసెంబ్లీ అప్రూవల్ కూడా ఉన్నది. అదే చాలా పవర్ఫుల్. 10 మార్చి 2016న అప్పటి గవర్నర్ నర్సింహన్ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని క్యాబినెట్ తయారు చేసి ఆమోదించిందే.
ఆ ప్రసంగాన్ని గవర్నర్ ఆమోదిస్తేనే కదా ఆయన అసెంబ్లీలో చదివేది. ‘తెలంగాణ ప్రజలకు ఉన్న అవసరాల ప్రకారం ప్రాజెక్టులను సరళీకృతం చేయడానికి ప్రాజెక్టులన్నింటినీ సమీక్షించి, అవసరమైన చోట తిరిగి రీడిజైన్ చేయడమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారాం, భక్త రాందాస్ ఎత్తిపోతల ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు, రీ-ఇంజినీరింగ్ చేసిన ప్రాజెక్టులకు కొన్ని ఉదాహరణలు’ అని గవర్నర్ ప్రసగించడమే అందుకు ఉదాహరణ.
దేశంలోనే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, శాసనసభకు వివరించిన ఘనత కేసీఆర్‌దే. 31 మార్చి 2016నాడు ప్రాజెక్టులపై వివరించారు. ఇక ఏకపక్షంగా సొంత నిర్ణయమని కమిషన్ ఎత్తిచూపడమే నివేదికలోని డొల్లతనాన్ని బయటపడుతున్నది. తట్టెడు మట్టి ఎత్తకుండానే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏడాది కాలంలోనే రెండితలు చేసింది నాటి కాంగ్రెస్.
కేంద్రానికి డీపీఆర్ ఇవ్వకుండానే, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, మహారాష్ట్రతో బరాజ్ లెవల్పై అగ్రిమెంట్ చేసుకోకుండానే పనులను ఏజెన్సీలకు అప్పగించింది. మరి అది తప్పుకాదా? అంతెందుకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో ‘నారాయణపే ట- కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్‌ను రూ.4,350 కోట్లతో ప్రారంభించారు. దానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? నీటి కేటాయింపులు ఉన్నాయా? డీపీఆర్ ఉందా? కానీ మేడిగడ్డకు అన్ని అనుమతులున్నా నిందారోపణలు చేయడం గమనార్హం.
నిబంధనల మేరకు చేయకపోతే ఎందుకు చేయలేదని ప్రశ్నించిన కమిషన్ నిబంధనల మేరకు ప్రాజెక్టు బెనిఫిట్ కాస్ట్ రేషియోను లెక్కల పరంగానే కరెక్టుగా చేశారంటూ సైతం వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కమిషన్ రంధ్రాన్వేషణ తీరుకు అద్దం పడుతున్నది. తప్పుపట్టాలనే ఉద్దేశమే తప్ప కమిషన్‌కు మరేమీ లేదని తెలిసిపోతుంది. బరాజ్‌లకు అనుమతులు లేవని, క్యాబినెట్ ఆమోదం లేదని, గవర్నమెంట్ బిజినెస్ రూల్స్‌ను ఎక్కడా పాటించలేదని, కేసీఆర్ ఏకపక్ష నిర్ణయమంటూ నివేదిక మొత్తం కమిషన్ ఏకరువు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్‌ను ముందుగా సమర్పించాల్సి ఉంటుంది.
2016లో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కానీ ప్రాజెక్టును చేపట్టేందుకు కావాల్సిన సాంకేతికపరమైన అంశాలకు సంబంధించి అన్ని చర్యలను తీసుకున్నది. 2015లో అందుకు సంబంధించిన వివరాలను సబ్మిట్ చేశారు. అందుకు అనుగుణంగానే అక్టోబర్ 30, 2017లో, నవంబర్ 30, 2017 హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చాయి. 2018లో డీపీఆర్‌ను పూర్తిస్థాయిలో సమర్పించింది. దీనిని ఎలా తప్పుబడతారు.?