హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య స్పష్టంచేశారు. అది తెలంగాణ ప్రజల కన్నతల్లిలాంటిదని, అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపైనే ఉన్నదని చెప్పారు. 25 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న ఇంటి పార్టీని కాపాడుకుంటే అది మనలను కాపాడుతుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
‘బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏండ్లు అవుతుంది. నా కన్నతల్లి అంటే నాకెంత గొప్పనో.. రాష్ట్ర సాధన కోసం పెట్టిన ఆ పార్టీ, జెండా అంతే సమానమైనది’ అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని కచ్చితంగా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, దానిని బతికించుకోవాలి.. అని పిలుపునిచ్చారు. దానిని బతికించుకుంటే అది మనలను బతికిస్తదని చెప్పారు. బీఆర్ఎస్ను కనుక మనం చంపేసి, కాలుష్యాన్ని పీలిస్తే అది మనలనే చంపేస్తదని హెచ్చరించారు. రాష్ట్ర సాధన కోసం ఏర్పాటై అనేక ఆటుపోట్లకు గురై, అనేక అవమానాలకు గురై, ఇంత సుదీర్ఘకాలం మనగలిగిన పార్టీ దేశంలో బీఆర్ఎస్ ఒక్కటేనని గుర్తుచేశారు.