హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు రాష్ట్రంలో ఏరులై పారిన గుడుంబా ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. గుడుంబా రక్కసిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలే అందుకు కారణం. సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేందుకు రూ. 1000 కోట్లు కేటాయించారు. రుణాలిచ్చి, ట్రాక్టర్లు కొనిచ్చి, కుట్టుమిషన్లు పంపిణీ చేసి, కిరాణా దుకాణాలు పెట్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ర్టాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దారు. కొందరు అక్రమార్కులు మాత్రం కర్ణాటక నుంచి దేశీదారు, ఏపీ నుంచి గుడుంబా, ఛత్తీస్‌గఢ్ నుంచి నాటుసారాను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీరికి అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. గత ఆరు నెలల్లో 5,730 సారా అక్రమ రవాణా కేసులు నమోదు చేసి 5,934 మందిని కటకటాల వెనక్కి పంపారు. 2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 2,25,736 సారా తయారీ, అక్రమ రవాణా కేసులు నమోదు చేసి 1,29,766 మందిని అరెస్టు చేశారు. 28,77,626 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొన్నారు. 6,96,49,402 లీటర్ల నల్లబెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 13,060 వాహనాలు సీజ్ చేశారు. 2014 నుంచి 2022 వరకు 71,596 మందిని బైండోవర్ చేశారు. ఇప్పటి వరకు 70మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు.