హైదరాబాద్, నవంబర్22 (నమస్తే తెలంగాణ) : తుంగభద్ర డ్యామ్‌లో నీటినిల్వ పడిపోయిందని చెబుతూ కర్నాటక చేపట్టనున్న నావలి రిజర్వాయర్ విస్తరణ, అదేవిధంగా హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను తవ్వాలని ఏపీ సర్కారు చేసిన ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు ఆక్షేపించింది. ట్రిబ్యునల్ అవార్డులో అందుకు సంబంధించిన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. నీటినిల్వ పెంపు కోసం కేంద్రమార్గదర్శకాలను అనుసరించి ప్రాజెక్టులో పూడికతీతను చేపట్టాలని స్పష్టం చేసింది. 220వ తుంగభద్ర రివర్ బోర్డు సమావేశం హోస్పేట్ కేంద్రంగా శుక్రవారం నిర్వహించారు. హైబ్రిడ్మోడ్లో కొనసాగిన ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తిశాఖ జాయింట్ సెక్రటరీ రిచామిశ్రాతోపాటు, కర్నాటక జలవనరుల శాఖ సెక్రటరీ కృష్ణమూర్తి బీ కులకర్ణి, తెలంగాణ, ఏపీ సాగునీటిపారుదలశాఖల ఈఎన్సీలు అనిల్‌కుమార్, వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తుంగభద్ర డ్యామ్ వద్ద కేటాయింపులకు మించి జలాలను వినియోగించుకునేందుకు ట్రిబ్యునల్ 1 అవార్డులో ఎలాంటి నిబంధనలు లేవని నొక్కిచెప్పారు. కర్నాటక, ఏపీ రాష్ర్టాల ప్రతిపాదనలతో శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై అనేకసార్లు బోర్డుకు స్పష్టం చేశామని గుర్తుచేశారు.
కేసీకెనాల్‌కు తుంగభద్ర డ్యామ్ హైలెవల్ కెనాల్ ద్వారా జలాలను మళ్లించేందుకు అనుమతించాలని ఏపీ చేసిన ప్రతిపాదనలను తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. కృష్ణా ట్రిబ్యునల్ (బచావత్ ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం కడప- కర్నూ ల్ కెనాల్‌కు సుంకేసుల బరాజ్ నుంచి మాత్ర మే తుంగభద్ర నదీజలాలను మాత్రమే వాడుకోవాలని గుర్తుచేశారు. అయితే ఏపీ ఆది నుం చి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తింది. తుంగభద్ర నదీజలాలకు బదులుగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అనుమతుల్లేని పలు ప్రాజెక్టుల కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు మళ్లిస్తున్నదని ఆక్షేపించింది. తాజాగా చేసిన ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చే సింది. ఏపీ అక్రమ మళ్లింపులను తుంగభద్ర బోర్డు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ఈఎన్సీ వ్యతిరేకించారు. టిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా నిర్ణయాలను తీసుకోవద్దని బోర్డుకు సూచించారు. తెలంగాణ అంతర్రాష్ట జలవిభాగం ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్‌తోపాటు ఇంజినీర్లు పాల్గొన్నారు.