హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుంగభద్ర నుంచి కూడా అదనంగా జలాలను వినియోగించుకుంటున్నదని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం సైతం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ రాష్ట్రం తన వాదనలను కొనసాగించింది.
ప్రధానంగా తుంగభద్ర రైట్ బ్రాంచ్‌లో లెవల్ కెనాల్‌పై వాదనలు వినిపించింది. అవిరి నష్టాలు 5.5 టీఎంసీలు కలుపుకుని ఎల్ఎల్సీకి మొత్తంగా 29.5 టీఎంసీలను ట్రిబ్యునల్-1 కేటాయించిందని గుర్తుచేసింది. అంతేకుండా, శ్రీశైలం జలాశయానికి అత్యధిక మొత్తంలో వరద ప్రవాహాలు తుంగభద్ర నుంచే వస్తాయని, ఈ నేపథ్యంలో తుంగభద్రపై నీటి వినియోగాలకు సంబంధించి ట్రిబ్యునల్-1 కర్ణాటక, ఏపీకి అనేక ఆంక్షలను విధించిందని గుర్తుచేసింది. అయినప్పటికీ, ఏపీ వాటిని పట్టించుకోవడం లేదని తెలిపింది.
ఎల్ఎల్సీ ఆయకట్టు కోసమే ఆర్డీఎస్ కుడికాలువ, గురు రాఘవేంద్ర లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటుచేసిందని, కేటాయింపుల కంటే అదనపు జలాలను వినియోగించుకుంటున్నదని పేర్కొన్నది. తద్వారా శ్రీశైలం జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లోలు తగ్గి, తెలంగాణ ప్రాజెక్టులకు విఘాతం ఏర్పడుతున్నదని తెలిపింది. గురు రాఘవేంద్ర లిఫ్ట్ సీమ్ ద్వారా నీటిని వినియోగించుకునేందుకు ఏపీకి అనుమతించవద్దని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఎల్ఎల్సీ కింద వాస్తవ అవసరాలు 17.41 టీఎంసీలేనని, ఫలితంగా 6.59 టీఎంసీలు ఆదా అవుతాయని, ఆ జలాలను తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించాలని అభ్యర్థించింది. శుక్రవారం కూడా తెలంగాణ వాదనలు కొనసాగనున్నాయి.