హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు నిర్ణయాలు తప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారులకు తన ప్రభుత్వంలో చోటు కల్పిస్తున్నారు. వాస్తవానికి రిటైర్ అయ్యి ప్రభుత్వ కొలువుల్లో కొనసాగుతన్నవారిని పంపించేస్తారని అంతా భావించారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఓఎస్డీలుగా, ఇతర హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. సీఎస్ శాంతికుమారి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి శాఖలవారీగా ఈ జాబితాను తెప్పించారు. కానీ, ఆరు నెలలుగా ఆ జాబితా అటకెక్కింది. అంతేకాదు.. రిటైర్ అయిన మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాజాగా ప్రభుత్వ పదవుల్లో చేరుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. భారీగానే పదవీవిరమణ చేసిన వారికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన మరుక్షణమే ఉత్తర్వులు వెలువడటం మొదలైంది. శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఙం ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో కీలకంగా వ్యవహరించి, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్‌గా వ్యవహరించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు తీసుకొచ్చింది. నీటిపారుదలశాఖ సలహాదారు పదవిని ఆయనకు కట్టబెట్టింది. ఆదిత్యనాథ్‌దాస్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకి అన్న పేరు ఉన్నది. నాటి జలయజ్ఙం ప్రాజెక్టుల పనుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకోవటంలో ఆయన ప్రమేయంతో పాటు , తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేయించి పనులు ఆపివేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత పదేండ్లు కూడా ఏపీ నీటిపారుదల రంగంలోనే పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఆయనను తెచ్చిపెట్టడంపై తెలంగాణ నీటిపారుదల ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన కాపాడుతారో లేదో అన్న అనుమానం వ్యక్తమవుతున్నది.
సందీప్ శాండిల్యకు నార్కోటిక్స్ బాధ్యతలు
ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యకు తిరిగి నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన మే 31న పదవీ విరమణ చేశారు. నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేసే సమర్థులు చాలామందే ఉన్నా, ప్రభుత్వం ఆయనకే మరోసారి బాధ్యతలు అప్పగించింది. పదవీ విరమణ చేసిన పోలీసులను ప్రత్యేకంగా నియమించటం ఏమిటని రేవంత్ అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనే రిటైర్డ్ పోలీసులను తిరిగి పోస్టుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే మరో అధికారి కూడా రిటైర్ కాబోతున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కూడా సర్వీస్ ఎక్స్టెన్షన్ లభిస్తుందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీకి ఐడ్వెజర్
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే శాసనసభకు సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను సలహాదారుగా నియమించారు. అయితే, అప్పటికే శాసనసభ సెక్రటరియట్కు పదవీ విరమణచేసిన నరసింహాచార్యులు ఎక్స్టెన్షన్పైనే కొనసాగుతున్నారు. ఏడేండ్లకు పైగా ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ పొందుతున్న నరసింహాచార్యులపై కొత్తగా సలహాదారును తీసుకొచ్చిపెట్టారు. శాసనసభ వ్యవస్థలో రెగ్యులర్ సెక్రటరీని ఎప్పుడు నియమిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిటైర్డ్ అధికారుల రిటైన్‌పై విమర్శించిన రేవంత్.. ఇప్పుడు దాన్నే కొనసాగిస్తుండటం విచిత్రం.
‘నీటిని కొల్లగొట్టేందుకే ఆదిత్యనాథ్‌కు పదవి’
తెలంగాణను ఎండబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సరారు కుట్ర లు చేస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించా రు. సీఎం పదవిలో ఉండి రాష్ట్ర నీటి హకులను పొరుగు రాష్ట్రానికి అప్పజెప్పేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మన నీళ్లను ఆంధ్రోళ్ల చే తుల్లో పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడిగా ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆదిత్యనాథ్‌దాస్ అనేకసార్లు కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రాజెక్టులపై రాతపూర్వక ఫిర్యాదులు చేశారని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర జలవనరులకు సలహాదారుగా ని యమించడం దారుణమని మండిపడ్డా రు. ఇది తెలంగాణ నీటి హకులను కా లరాయడమే అని అభివర్ణించారు. తె లంగాణను శాశ్వతంగా బీడుగా మార్చే ందుకు, మన నీళ్లను ఆంధ్రాకు అప్పగించబోతున్నారని ధ్వజమెత్తారు. కేం ద్రం లో జలశక్తి మంత్రిత్వ శాఖ కావాలని చంద్రబాబు కోరుతున్నారన్నారు. అదే జరిగితే.. అకడ గురువు, ఇకడ శిష్యు డు తెలంగాణ నీళ్లను మింగేయటం పకా అని అనుమానం వ్యక్తంచేశారు.
పదవీ విరమణ చేసిన పోలీస్, ఐఏఎస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించటం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వం వెంటనే తొలగించాలి.
– పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలివి (2020 జూన్ 25న)