TG NAB | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ మేరకు చేపట్టిన విస్తృత తనిఖీల్లో డిసెంబర్ నెలలోనే 641 కేజీల గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య వెల్లడించారు.
డ్రగ్స్‌ను పట్టుకునేందుకు 266 డాగ్స్‌ను రంగంలోకి దించామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాక్టర్లు, బస్సులు, దేవుని రథాలు, సీఎన్జీ వాహనాల్లోని సిలిండర్లలో, పుస్తకాల రూపంలో కనిపించే డబ్బాలతో పాటు రకరకాల పద్ధతులలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇటీవల వరంగల్ రైల్వే స్టేషన్లో స్నిఫర్ డాగ్‌తో తనిఖీలు చేస్తుండగా 100 మీటర్ల దూరంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులో కుండీల్లో గంజాయి మొకలు పెంచుతున్న విషయాన్ని డాగ్స్ పసిగట్టాయని వెల్లడించారు.
గంజాయి చాక్లెట్లతో విద్యార్థులు, కూలీలను టార్గెట్ చేస్తున్న ముఠాలను రాజస్థాన్ వెళ్లి పట్టుకొని, అక్కడి ఫ్యాక్టరీని మూయించామని వివరించారు. డిసెంబర్ 1 నుంచి 20 వరకు 641 కేజీల గంజాయి, 15కేజీల గంజాయి చాక్లెట్లు, 1600 గ్రాములు హాష్‌ఆయిల్, 1383గ్రాముల ఎండీఎంఏ, కేజీ ఓపియం, 97గ్రాముల ఓజీ హైడ్రా, 115 గ్రాముల చరాస్, పాపిస్ట్రా 53 కేజీలు, 44 గ్రాముల హెరాయిన్ సీజ్ చేసి, 315 మందిపై 148 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మొత్తంగా రూ.4.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్టు వివరించారు.