రవీంద్రభారతి, మార్చి17: చరిత్రలో నిలిచిపోయేది ఫొటోనేనని, వెయ్యి మాటల కన్న ఒక్క ఫొటో ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆ రోజుల్లో ప్రప్రథమంగా దేశంలో కెమెరాలు కొనుగోలు చేసి ఫొటోగ్రఫీని అభివృద్ధి చేసిన ఘనత హైదరాబాద్, త్రిపుర సంస్థానాలకే దక్కిందని అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పత్రికల్లో ఎన్ని వార్తలు ప్రచురితమైనా.. పాఠకుల దృష్టిని ఆకర్షించేది ఫొటోలు మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో పత్రికలకు ఆదరణ తగ్గిపోతున్నదని.. కానీ ఇది తాత్కాలికం మాత్రమేనని, భవిష్యత్ పత్రికలకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, అఖిలభారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ, ప్రధాన కార్యదర్శి కే నారాయణ, గంగాధర్, కేఎన్ హరి తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్ననమస్తే తెలంగాణ ఫొటో జర్నలిస్టులు..
గడసంతల శ్రీనివాస్, ఎం గోపికృష్ణ (హైదరాబాద్), బందగీ గోపి (మహబూబ్‌నగర్), గొట్టె వెంకన్న(వరంగల్), సూర్య శ్రీధర్ (తెలంగాణ టుడే) గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.