హైదరాబాద్ : మాతా శిశు మరణాల విషయంలో తెలంగాణ మెరుగైందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రిలో నిర్వహించిన ఇన్ఫెక్షన్ల నివారణ – అవగాహన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
మాతా శిశు మరణాల్లో ఒకప్పుడు తెలంగాణ ఐదు, ఆరు స్థానాల్లో ఉండేదన్నారు. ఇప్పుడు ఏడాదికి లక్షకు 43 మరణాలతో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ మరణాలకు గల కారణాలపై లోతైన విళ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రసవం జరిగిన తర్వాత బాలింతకు ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలన్నారు. పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే తల్లీబిడ్డను ఇంటికి పంపాలని సూచించారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణుల సమస్యలు గుర్తించగలిగితే మరణాలను తగ్గించొచ్చని మంత్రి పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో త్వరలోనే 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో ఆరోగ్య సేవలు మరింత మెరుగువుతాయని చెప్పారు. ఇక నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో ఎంసీహెచ్ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.