హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఈ ఏడాది ఒక్కో రైతు కుటుంబంపై ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల లక్ష రూపాయలు . రైతుల కోసం ఎంతో చేస్తున్నామంటూ గప్పాలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు మాత్రం ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. ఉత్తరప్రదేశ్ అత్యంత తక్కువ ఖర్చు చేస్తూ చివరి స్థానంలో నిలిచింది. ఇదేదో గుడ్డిగా చెబుతున్న లెక్కలు కాదు. జాతీయ స్థాయిలో ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి ప్రైవేట్ లిమిటెడ్(సీఎంఐఈ) ఈ విషయాలను వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతు కుటుంబాలపై దేశంలో ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు తీసింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో చేసిన ఖర్చుల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.
తెలంగాణ ఫస్ట్…యూపీ లాస్ట్
సీఎంఐఈ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.1,03,917 ఖర్చు చేయగా యూపీలో మాత్రం అతి తక్కువగా రూ.9,264 మాత్రమే ఖర్చు చేసినట్లు తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ తర్వాత తమిళనాడు రూ.99,768, పంజాబ్ రూ.80,984, చత్తీస్గడ్ రూ.53,200, కేరళ రూ.52,250 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
13వ స్థానంలో గుజరాత్
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ మాడల్ అట్టర్ ఫ్లాప్ అని మరోసారి నిరూపితమైంది. గుజరాత్ మాడల్‌పై మోదీ చెప్పినవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయింది. రైతుల కుటుంబాలపై ఖర్చు చేస్తున్న మొత్తం 20 రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోగా, ఇందులో గుజరాత్ 13వ స్థానంలో నిలవడం గమనార్హం. ఈ రాష్ట్రంలో ఏడాదికి రైతు కుటుంబాలపై చేస్తున్న ఖర్చు కేవలం రూ.21,914 మాత్రమే. అంటే గుజరాత్ కన్నా తెలంగాణ ఏకంగా రూ.82 వేలు అధికంగా ఖర్చు చేస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ర్టాలు అట్టర్‌ప్లాప్
దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు సీఎంఐఈ నివేదిక బలం చేకూర్చుతున్నది. రైతు కుటుంబాలకు అధికంగా ఖర్చు చేస్తున్న జాబితాలో టాప్-5 రాష్ర్టాల్లో ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం కూడా లేదు. అంతే కాకుండా బీజేపీ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో రైతు కుటుంబాలపై చేస్తున్న ఖర్చు జాబితాలో అట్టడుగున నిలిచింది. అదే విధంగా అస్పాం రూ.18,269 ఖర్చుతో 17వ స్థానంలో, మధ్యప్రదేశ్ 14వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 11వ స్థానంలో, హర్యాన 10వ స్థానంలో, మహారాష్ట్ర 9వ స్థానంలో, కర్ణాటక 8వ స్థానంలో నిలిచాయి.
రైతుల కోసం రూ. 55వేల కోట్ల ఖర్చు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మొదలు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరుగాంచింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతియేటా వేల కోట్లను ఖర్చు చేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతుల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులో రైతుబంధు కోసం రూ.15 వేల కోట్లు, చేపల పంపిణీ కోసం రూ.100 కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు సుమారు రూ.30 వేల కోట్లు, ఉచిత విద్యుత్తు కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రైతు కుటుంబాలకు అందుతున్నాయి.