Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒక్క తలసరి, జీఎస్డీపీలోనే కాదు.. సాగు, పారిశ్రామికీకరణ, సేవలు, సంక్షేమం.. ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్ ఔట్లుక్) -2024 వివిధ రంగాల్లో తెలంగాణ సాగించిన ప్రగతిని, తాజా పరిస్థితులను వెల్లడించింది.
తలసరిలో మేటి.. మరెవరు సాటి
తలసరి ఆదాయాన్ని, దాని వృద్ధిరేటును ఆ దేశ లేదా రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనంగా భావిస్తారు. ఈ రెండు అంశాల్లో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే.. తెలంగాణ ఎంతో ఎత్తులో ఉన్నది. కేసీఆర్హయాంలో గడిచిన పదేండ్లలో చేపట్టిన సంస్కరణలే దీనికి కారణంగా చెప్పొచ్చు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,105గా నమోదైంది. అప్పుడు జాతీయ తలసరి ఆదాయం రూ.86,647గా ఉండేది. ఈ లెక్కన చూసుకొంటే జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ ఆదాయం 43 శాతం ఎక్కువగా ఉన్నది.
2022-23 సంవత్సరానికి వచ్చేసరికి ఈ అంతరం మరింతగా పెరిగిపోయింది. 2023-24నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299కు చేరుకున్నది. జాతీయ తలసరి ఆదాయం మాత్రం రూ.1,83,236 కే పరిమితం అయ్యింది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం..దేశ తలసరి ఆదాయం కంటే 89.53 శాతం ఎక్కువగా నమోదైంది. అంతేకాదు.. దేశ తలసరి ఆదాయం కంటే, రాష్ట్రంలోని 30 జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ మేరకు సామాజిక ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది.
జీఎస్డీపీలో దూకుడు
తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే, 2023-24నాటికి తెలంగాణ జీఎస్డీపీ రూ. 14.64 లక్షల కోట్లకు చేరింది. పదేండ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ రూ. 9.59 లక్షల కోట్ల మేర పెరిగింది. జీఎస్డీపీలో సేవారంగం 65.7 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మైనింగ్, తయారీ రంగం 18.5%, వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.8% వాటాను కలిగి ఉన్నాయి.
రాష్ట్రంలోని మొత్తం శ్రామిక శక్తిలో 47.34% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలమీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 2022-23లో వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం 414 లక్షల మెట్రిక్ టన్నులుగా రికార్డయ్యింది. వరి, పత్తి, మొక్కజొన్న ఇందులో ప్రధాన పంటగా ఉన్నది. ఇక, రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 24% మేర అటవీప్రాంతమే ఉన్నది. జాతీయ సగటు 21.34 శాతంతో పోలిస్తే, ఇది ఎక్కువ. ఈ మేరకు సామాజిక ఆర్థిక సర్వే 2024 వివరించింది.

ప్రగతిని కూడా దాచాలని..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క తలసరి, జీఎస్డీపీలో వృద్ధే కాదు& సాగు విస్తీర్ణం కూడా ఎంతో పెరిగింది. ధాన్యం దిగుబడి కొత్త రికార్డులను నమోదు చేసింది. అంతేకాదు.. విద్యుత్తు సంస్థల బలోపేతం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో పెరుగుదల, విద్య-వైద్య రంగాల అభివృద్ధి, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, వైద్య కళాశాలల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, అన్నివర్గాల అభ్యున్నతికి 400కు పైగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా ఎంతో పెద్దది.
అయితే, ఆర్థిక సర్వేలో ఆ అంశాలను, లెక్కలను ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయాస పడింది. గతంలో జరిగిన ప్రగతిని విస్మరించి.. తాము చేపట్టబోయే పనుల గురించి మాత్రమే ఏకరువు పెట్టింది. అంతేకాదు నిజాలను కూడా దాచిపెట్టింది. దాదాపు ప్రతీ రంగంలో పదేండ్లలో తెలంగాణ సాగించిన ప్రగతిని విస్మరించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్థిక సర్వేలో అడుగడుగునా ఈ విషయం ప్రస్ఫుటమైంది.
