హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఉద్యమనేతగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు మహోన్నతమైనవని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో వక్తలు కొనియాడారు. తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు నేతృత్వంలో సోమవారం నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులతోపాటు విద్యార్థి జేఏసీ నాయకులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం, వారి గుర్తింపు దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చర్యలు విస్మరించరాదని గుర్తుచేశారు. ఈ అద్భుతమైన భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే కేసీఆర్ చలువే అని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఎన్నో పదవులు, అవకాశాలు కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు.
ఉద్యమకారుడిగా ఆయనను ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు కేశవరావు మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసమే రాష్ట్ర సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించిందని తెలిపారు. సమావేశానికి హాజరైన వారు తమ సలహాలు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని పలువురు హెచ్చరించారు. ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, నాయకులు రాములునాయక్, పిడమర్తి రవి, మోతె శోభన్‌రెడ్డి, పల్లె ప్రవీణ్‌రెడ్డి, సత్య, వాలమల్ల కృష్ణ, హరిబాబు, దత్తాత్రేయ, చందు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం రెండు వర్గాల పోటీ నినాదాలతో రసాభాసగా మా రింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కల్పించుకొని వారిని సముదాయించారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు నొచ్చుకున్నారు. తాను ఈ కమిటీ నుంచి తప్పుకొంటానని హెచ్చరించారు. చివరకు ఉద్రిక్తతల నడుమ సమావేశాన్ని పూర్తి చేశారు.