ఖైరతాబాద్, మే 29 : తెలంగాణ కవులు, జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమికొడుతామని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బానిసలు కొందరు మీడియా సమావేశంలో తెలంగాణ కవులు, జర్నలిస్టుల అస్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న వారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనబడలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తాను పదకొండు రోజులు ఆహారాన్ని తీసుకోలేదని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్‌కు వత్తాసు పలుకుతూ తెలంగాణ ఉద్యమకారులను కించపరిస్తే సహించబోమని హెచ్చరించారు.
పాశం యాదగిరి, పృథ్వీరాజ్‌పై కారు కూతలు కూశారని, ముఖ్యంగా ఉద్యమకారులపై విషప్రచారం చేస్తే చెప్పులతో తన్ని తరిమికొడుతామని పేర్కొన్నారు. తెలంగాణ అమరుడు కొమురయ్య భార్య పూలమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న ఆంధ్రాపాలకులు ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని నీలదీశారు. తెలంగాణ కళాకారులు డాక్టర్ ఒగ్గు రవి, అందె భాస్కర్ మాట్లాడుతూ ఎవరో వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి, ఉద్యమకారులు, జర్నలిస్టులు, కళాకారులను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కవి, రచయిత షెహబాజ్ అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరోక్షంగా ఇక్కడ తెలుగుదేశం, చంద్రబాబు పాలన నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని వాపోయారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే చంద్రబాబు విగ్రహాలను సైతం ఇక్కడ పెడుతాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో కొత్తపల్లి మధు, సనత్ జైసూర్య తదితరులు పాల్గొన్నారు.