హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): తొలిదశ (1969) తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘం పూర్వ నాయకుడు, కవి, రచయిత డాక్టర్ ఎం శ్రీధర్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ దవాఖానలో సోమవారం తుది శ్వాసవిడిచారు. ఆయన మృతిపై సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్‌రెడ్డి చేసిన కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. 1969 ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని, తాను నమ్మిన విలువల కోసం కట్టుబడి, రాజీ పడకుండా పనిచేశారని పేర్కొన్నారు. శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చల్లాపురంలో జన్మించిన శ్రీధర్‌రెడ్డి ఓయూలో ఉద్యమనేతగా ఎదిగారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పట్టా పొందారు. విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించడానికి ముందే తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలేపిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రచించిన ‘నీ కులం ఏది?’ అనే రచన విశేష ఆదరణ పొందింది. శ్రీధర్‌రెడ్డి భౌతికకాయానికి మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన సహచరులు తెలిపారు.
పలువురు ప్రముఖుల సంతాపం
శ్రీధర్‌రెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షుడిగా రాజకీయ పార్టీలు తెలంగాణ వైపు నడిచేలా శ్రీధర్‌రెడ్డి వ్యవహరించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే కేశవరావు పేర్కొన్నారు. శ్రీధర్‌రెడ్డి తనకు ఆప్తుడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. శ్రీధర్‌రెడ్డి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, నాళేశ్వరం శంకరం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.