రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి రూ. 305 కోట్లు
సృష్టించిన సంపద రూ.25,782 కోట్లు
పంపిణీ చేసిన చేప పిల్లలు 380 కోట్లు
మత్స్యకారుల ఆదాయం 120% వృద్ధి
అండగా మిషన్ కాకతీయ, కాళేశ్వరం
ఏడు అంశాల్లో దేశంలోనే అగ్రగామిగా..
ఏ మాత్రం సముద్ర తీర ప్రాంతం లేని ఒక రాష్ట్రం చేపల పెంపకాన్ని ప్రాధాన్య అంశంగా చుకోవడమే పెద్ద సాహసం!
దానిపై శ్రమించి.. మొత్తంగా పెట్టిన రూ.305 కోట్ల పెట్టుబడితో రూ.25,782 కోట్ల సంపదను సృష్టించడం అపూర్వం!
ఆ సాహసం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ అపూర్వ సన్నివేశానికి సాక్షిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఆరేండ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించిన చాలెంజ్.. నేడు మత్స్యరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నది. నీలి విప్లవానికి నిండు నిర్వచనంలా నిలుస్తున్నది. మత్స్య కారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నది.
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 2016లో చేపట్టిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం సాధిస్తున్న విజయాలు అబ్బుర పరుస్తున్నాయి. తెలంగాణ సాధించిన ఈ అద్భుతం మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేస్తున్నది. ఐదేండ్లలోనే వారి ఆదాయం రెట్టింపు అయ్యింది. ఫామ్‌గేట్ ధర ప్రకారం 2016-17లో మత్స్యకారుల వార్షికాదాయం సుమారు రూ.45 వేలు ఉండగా 2021-22లో రూ.94వేలకు పెరగడం విశేషం. ఇది తెలంగాణ సాధించిన అద్భుత విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు నిదర్శనం. చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయడమే కాదు.. వచ్చిన దిగుబడిని మత్స్యకారులు అమ్ముకొనేందుకు వీలుగా వారికి వాహనాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి పెట్టింది.
మోటర్ సైకిళ్లు, ట్రాలీ ఆటోలు, మొబైల్ ఫిష్ అవుట్లెట్లను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసింది. దాదాపు రూ.530 కోట్లు వెచ్చించి 62,173 వివిధ వాహనాలను మత్స్యకారులకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. హైదరాబాద్ సమీపంలోని
కొహెడలో అత్యాధునిక, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మిస్తున్నది. పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది. స్వరాష్ట్రంలో మత్స సహకార సొసైటీల సభ్యుల సంఖ్య కూడా 2.80 లక్షల నుంచి 3.55 లక్షలకు పెరగడం మరో విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో 4,793 సొసైటీలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం వాటా 0.5 శాతంగా ఉండటం ఈ రంగం సాధిస్తున్న ప్రగతికి మరో నిదర్శనం.
చెరువులు జియో ట్యాగింగ్
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు దోహదం చేశాయి. మిషన్ కాకతీయ పథకం పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మత్స్యరంగానికి పునర్జీవనం ప్రసాదిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఎత్తుకు తీసుకెళ్లింది. మత్స్యశాఖ రాష్ట్రంలోని ప్రతి చెరువును జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసింది. చేపల పెంపకానికి అనువైన చెరువులను గుర్తించింది. ఏ చెరువులో ఎంత కాలం నీరు నిల్వ ఉంటుందనే అంశాన్ని కూడా క్రోడీకరించింది. 2016-17లో 3,939 చెరువుల్లో చేప పిల్లను వదిలి పెట్టగా.. 2021-22లో ఆ సంఖ్య 23,263 కు పెరిగింది. వచ్చే ఏడాది ఈ సంఖ్య 27వేలకు చేరనున్నది.
నాడు దిగుమతులు-నేడు ఎగుమతులు
ఉమ్మడి రాష్ట్రంలో చేపలను దిగుమతి చేసుకున్న తెలంగాణ ప్రాంతం.. ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగింది. మన రాష్ట్రం నుంచి పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ర్టాలకు తెలంగాణ చేపలు ఎగుమతి అవుతుండటం విశేషం.
మార్కెటింగ్ సౌకర్యాలపై దృష్టి
రాష్ట్రంలో మత్స్యరంగాన్ని మరింత బలోపేతం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ)ని నెలకొల్పాలని నిర్ణయించింది. దీనితోపాటు కొహెడలో10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపల మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నది. ముషీరాబాద్, నిజమాబాద్‌లో ఉన్నతస్థాయి మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి మండల కేంద్రంలోనూ చేపల మార్కెట్లను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నది.
తెలంగాణలో అమెరికా సంస్థ పెట్టుబడులు
తెలంగాణ మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఫిష్ఇన్ సంస్థ ఇటీవల ముందుకొచ్చింది. ఈ సంస్థ మిడ్‌మానేరు రిజర్వాయర్ ప్రాంతంలో 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్లతో మంచినీటి చేపల పెంపకాన్ని చేపట్టనున్నది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మందికి ఉపాధి లభించనున్నది. మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
కొర్రమీనుల పెంపు.. పైలెట్ ప్రాజెక్ట్
ఇప్పటివరకు సాధారణ చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న కొర్రమీను పెంపకంపై దృష్టి సారిస్తున్నది. కరీంనగర్‌లోని మిడ్ మానేరు ప్రాజెక్టులో కొర్రమీనుల పెంపకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నది. ఇందుకోసం భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సీఐఎఫ్ఏ)తో ఒప్పందం చేసుకొన్నది. తెలంగాణలో లక్ష టన్నుల కొర్రమీనులకు డిమాండ్ ఉండగా 40వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి.
తెలంగాణ మత్స్యశాఖ దేశంలోనే అగ్రగామి