రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను పూర్తిగా తహసీల్దార్లే చేపట్టనున్నారు. ఇప్పటివరకు తహసీల్దార్‌తోపాటు, డిఫ్యూటీ తహసీల్దార్ ఇద్దరికీ ధరణి లాగిన్ సౌకర్యం ఉండగా.. ఇకపై ఒక్క తహసీల్దార్కే లాగిన్ సౌకర్యం ఉండనున్నది. రంగారెడ్డి కలెక్టర్ అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలోని తహసీల్దార్లు దీన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం సరికొత్త చర్చకు దారితీసింది.
రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసమే
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లే నిర్వర్తిస్తూ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ ఇతర పనులపై తహసీల్దార్లు దృష్టిసారించడం లేదన్న కారణంతో గత ప్రభుత్వ హయాంలో డిఫ్యూటీ తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించారు. తహసీల్దార్ సెలవుల్లో ఉన్న సందర్భంలోనే డిఫ్యూటీ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేసేవారు. తహసీల్దార్లు ఇతర రెవెన్యూ పనుల్లో బిజీ కావడంతో కొంతకాలం తర్వాత రిజిస్ట్రేషన్లను పూర్తిగా డిఫ్యూటీ తహసీల్దార్లే చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ధరణికి సంబంధించిన అనేక ఫిర్యాదుల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోనూ ఈ తరహా ఫిర్యాదులు కోకొల్లలు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్లకు లాగిన్ సౌకర్యం తొలగించి రిజిస్ట్రేషన్ బాధ్యతలను పూర్తిగా తహసీల్దార్లకే అప్పగించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్లు సెలవుల్లో ఉన్నప్పుడు లేదా వివిధ రెవెన్యూ పనుల నిమిత్తం అందుబాటులో లేని సందర్భంలో కలెక్టర్ అనుమతితో లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసమే ఈ విధానానికి జిల్లాలో శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేనా?
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతున్నది. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నది. కలెక్టర్ స్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారాలున్నప్పటికీ తహసీల్దార్ నుంచి విచారణ దస్త్రం రానిదే అడుగు పడటం లేదు. ఇటీవల ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ నిర్వహించిన సమావేశంలో ఏం మార్పులు చేస్తే బాగుంటుందన్న కీలక చర్చ జరిగినట్టు తెలిసింది. డిప్యూటీ తహసీల్దార్లను రిజిస్ట్రేషన్ బాధ్యతల నుంచి తప్పించాలన్న అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇదే క్రమంలో తహసీల్దార్లకే పూర్తి బాధ్యతలు అప్పగించి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం.