Teenmar Mallanna | తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)ని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తెలియజేశారు.
బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. ‘ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను పరిచయం చేశారు.
ఎరుపు, ఆకుపచ్చ రంగులో పార్టీ జెండా ఉంది. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండా పైభాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను పేర్కొన్నారు. పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలిపారు.